
సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
● ప్రేమ పెళ్లికి నిరాకరించినట్లు ఆవేదన
శ్రీకాకుళం క్రైమ్: పెళ్లికి యువతి నిరాకరించిందనే కారణంతో ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు సెల్‌ఫోన్ టవర్ ఎక్కిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం వేకువజామున 3.30 గంటల సమయంలో శ్రీకాకుళం నగరంలోని పాత దీప మహాల్ సమీప టవర్ మీదకు ఒక యువకుడు అవలీలగా ఎక్కాడు. ఉదయమయ్యేసరికి అటుగా వెళ్లే ప్రజలు గమనించారు. ల్యాప్‌టాప్ పట్టుకుని సిగ్నల్స్ దొరకక అక్కడ కూర్చుని ఉన్నాడని అనుకున్నారు. అయితే ఎంతకీ దిగకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటాడేమోనన్న ఆందోళనతో ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణకు సమాచారమిచ్చారు. సరిగ్గా ఉదయం 8 గంటలకు అగ్నిమాపక కార్యాలయానికి కూడా కాల్ వెళ్లింది. అంతే క్షణాల్లో ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 8.45 గంటలకు ఎస్‌ఐ హరికృష్ణ చొరవతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ పూర్తి చేసి యువకుడిని కిందికి దించగలిగారు.
ఇదీ విషయం...
పొందూరు మండలంలోని కింతలి గ్రామానికి చెందిన విభూది శివకుమార్ (30) అనే యువకుడు ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌కు చెందిన ఒక యువతిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాని.. ప్రేమకు అంగీకరించిన యువతి వివాహానికి నిరాకరించిందని పోలీసుల వద్ద చెప్పాడు. దీనికి కారణం వారి పెద్దలేనని.. భరించలేకే ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ ఎం.హరికృష్ణ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో చట్ట పరిధిలో ఇటువంటి వ్యవహారం పరిష్కరించుకోవాలని సూచించారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే చట్టప్రకారం తాము న్యాయం చేస్తామని యువకుడికి హామీ ఇచ్చి రిమ్స్‌కు పంపించారు. జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం