
కలెక్టర్ గ్రీవెన్స్‌కు 64 వినతులు
కవిటి: జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు ఫిర్యాదు చేస్తున్న నారాయణస్వామి
ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
కవిటి: మండలంలోని గొర్లెపాడు పంచాయతీలో భూ ఆక్రమణలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ భూముల్ని రక్షించే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాలిన నారాయణస్వామి కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. గొర్లెపాడు పంచాయతీ పరిధిలోని చాలా వరకు ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, సంతలు ఆక్రమణలకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఒక ఆర్మీ జవాన్ భూములు కూడా అన్యాక్రాంతం అయినట్లు పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన భూములపై గతంలో ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ, ఎటువంటి చర్యలను చేపట్టడం లేదని తెలియజేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సరైన న్యాయం చేయలేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. వాస్తవానికి ఇదే భూ ఆక్రమణలపై గతంలో సాక్షి పత్రికలో సైతం కథనాలు వెలువడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ దృష్టికి తీసుకొచ్చారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా పలు శాఖలకు చెందిన అధికారులు మొత్తం 64 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 21, సెర్ప్‌కు 13, పంచాయతీరాజ్, విద్యుత్ పంపిణీ సంస్థలకు తలో 5, నీటి వనరులకు 3, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖలకు తలో 2 చొప్పున ఫిర్యాదులు అందాయి. మిగతా శాఖలకు ఒక్కొక్క ఫిర్యాదు చొప్పున నమోదైంది. ఈ పీజీఆర్‌ఎస్‌లో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పలు వినతులు పరిశీలిస్తే...
రాష్ట్ర ప్రభుత్వం మండలాల పునర్విభజన చేయనున్న నేపథ్యంలో లావేరు మండలం మురపాక గ్రామం మండల కేంద్రంగా ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. అలాగే లావేరు మండలం బుడుమూరు గ్రామానికి చెందిన ప్రజలు కూడా పీజీఆర్‌ఎస్‌లో బుడుమూరు మండల కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని వినతి అందజేశారు.
నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన బడ్డి జోగారావు శతశాతం దివ్యాంగుడు. దీంతో ఆయనకు రూ.15 వేల పింఛను ఇప్పించాలని కోరారు. అలాగే రణస్థలం మండలానికి చెందిన దివ్యాంగుడు కొయ్య దుర్గాప్రసాద్ తనకు పింఛన్ ఇప్పించాలని కోరారు.
ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ తెలప్పరేడు వద్ద రహదారిపై మద్యం షాపును ఏర్పాటు చేశారు. ఈ షాపు వలన స్థానికులకు ఇబ్బందులు వస్తున్నాయని, అక్కడ నుంచి వేరే చోటుకు ఈ మద్యం షాపును తొలగించాలని ఆ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, గోవిందరావు తదితరులు కోరారు.
శ్రీకాకుళం మండలం బలగ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్–1లో సబ్ డివిజన్1, 4ల్లో ఉన్న ప్రభుత్వ భూమి వరదగట్టు (కోనేరు) దురాక్రమణలకు గురైందని, స్థానిక వీఆర్వో, సచివాలయం సర్వేయర్ కలిసి మండల రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ గ్రామానికి చెందిన బోనెల చిరంజీవి ఫిర్యాదు చేశారు.