
ఆక్రమణల చెరలో ‘పోర్టుల్యాండ్’..?
● పట్టనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బంది
● గాలికొదిలేసిన పోర్టు అథారిటీ
పోలాకి: ఒకప్పుడు వెలుగు వెలిగిన కళింగపట్నం ఓడరేవు ఆ తర్వాత కాలంలో నౌకల రవాణా నిలిచిపోవడంతో సదరు ఓడరేవుకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మండలంలో ప్రస్తుతం నిరుపయోగంగా కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే మిగిలిపోయిన పోర్ట్‌ల్యాండ్‌పై కొందరి కన్నుపడింది. అంపలాం పంచాయతీ పరిధి నందిగాం రెవెన్యూలో సర్వే నంబర్–77లో 31.45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూములు ఇప్పుడు విలువైనవిగా మారడంతో కొందరు పెద్దలు అక్కడ గ్రద్దల అవతారం ఎత్తారు. గతంలో టీడీపీ హయాంలో(2014–19 మధ్యలో) అక్కడ మత్స్యకారుల విశ్రాంతి భవనం, వలలు, చేపలు నిల్వ గోదాముల నిర్మాణం చేపట్టిన సందర్భంలో సైతం పోర్టు అథారిటీస్ నుంచి ఎలాంటి క్లియరెన్స్‌లు ఇవ్వకపోయినా, అప్పటి నాయకత్వం ముందుకు వెళ్లడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా గత నాలుగేళ్ల నుంచి ఈ భూముల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు సైతం నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. వేరే ప్రభుత్వ సర్వే నంబరుతో వర్క్ ఐడీ క్రియేట్ చేసి పోర్టు భూముల్లో ఉపాధి పనులు చేపడుతూ ప్రజావేదిక ఆడిటింగ్ సమయంలో మేనేజ్ చేస్తూ వస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి.
హక్కులు కల్పించాలని వినతి
పోర్ట్‌ల్యాండ్ మొత్తం తమకే చెందుతుందని హక్కులు కల్పించాలని కోరుతూ ఇటీవల ఒక వ్యక్తి పోలాకి రెవెన్యూ కార్యాలయానికి వినతిపత్రం అందించిన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వినతి పత్రం వెనుక ఉన్నది ఎవరు అనే విషయంపై కూటమి పార్టీల నాయకుల్లో అంతర్గత చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క పోర్టు భూముల్లో ఇప్పటికే ప్రైవేటు కార్యకలాపాలు జరుగుతున్నాయని సర్వే నిర్వహించి భూముల వివరాలు, వాస్తవ విస్తీర్ణంపై హద్దులతో సైతం ప్రజలకు తెలియజేయాలని మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ సిబ్బంది మాత్రం ఆక్రమణలపై ఎందుకో నిద్ర నటిస్తోంది. మరోపక్క తమ హక్కులను సైతం పోర్టు అథారిటీస్ గాలికొదిలేసింది. కనీసం తమ భూముల్లో ఫెన్సింగ్ వేసి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునే ఆలోచన కూడా చేయడం లేదు. ఇదే కొనసాగితే రూ.కోట్లు విలువ చేసే పోర్టుల్యాండ్‌లో అక్రమార్కులు లంగరు వేసే పరిస్థితి మరెంత దూరంలో లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
రెవెన్యూ రికార్డుల్లో పోర్టుల్యాండ్ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. నందిగాం రెవెన్యూలో ఎస్‌ఎల్‌ఆర్‌లో ఫోర్టు అథారిటీస్‌కు 31.45 ఎకరాల భూములు ఉన్నట్లు వివరాలు ఉన్నాయి. ఆక్రమణలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. పోర్టు అథారిటీస్ వారు వచ్చి హద్దులు కోరితే చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– పి.శ్రీనివాసరావు, తహసీల్దార్, పోలాకి

ఆక్రమణల చెరలో ‘పోర్టుల్యాండ్’..?

ఆక్రమణల చెరలో ‘పోర్టుల్యాండ్’..?