
పఽథకం ప్రకారమే రాజశేఖర్ హత్య
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
● ఆగస్టులో కత్తి కొనుగోలు చేసిన నిందితుడు
జి.సిగడాం: స్నేహితుడి చేతిలో గత నెల 24న హత్యకు గురై, చికిత్స పొందుతూ గెడ్డకంచరాం గ్రామానికి చెందిన పుక్కళ్ల రాజశేఖర్ మృతి చెందిన కేసులో ముద్దాయి దమరసింగి గొల్లబాబు అలియాస్ శంకర్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసి పొందూరు కోర్టుకు తరలించారు. ముద్దాయికి రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జైలుకు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం కేసు వివరాలు వెల్లడించారు.
ఇంటి నుంచి కత్తి తీసుకొచ్చి
మండలంలోని గెడ్డకంచరాం – బాతువ కూడలి వద్ద పుక్కళ్ల రాజశేఖర్ (35)ను గొబ్బూరు గ్రామానికి చెందిన దమరసింగి గొల్లబాబు(శంకర్) పథకం ప్రకారమే హత్య చేశాడని సీఐ తెలిపారు. గెడ్డ కంచరాం గ్రామంలో తోటి స్నేహితుడు మేసీ్త్ర అప్పన్న ఇంట్లో ఒక శుభ కార్యానికి రాజశేఖర్, శంకర్ అనే వ్యక్తితో కలిసి వెళ్లాడు. అక్కడ స్నేహితుడు ఇచ్చిన మద్యం సేవించారు. ముద్దాయి గొల్లబాబు ఆలస్యంగా వెళ్లి మద్యం అడగగా.. వారు అప్పటికే మద్యం అంతా తాగేశామని చెప్పడంతో మద్యం విషయంలో ఇద్దరూ గొడవకు దిగారు. ఈ గొడవను అవకాశంగా తీసుకుని ముద్దాయి శంకర్ తన ఇంటి వద్ద భద్రపరుచుకున్న కత్తిని తీసుకొచ్చి రాజశేఖర్‌కు ఫోన్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో లక్ష్మణ్ అనే వ్యక్తికి ఫోన్‌చేసి రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడని అడిగాడు. అయితే గొడవలు వద్దని లక్ష్మణ్ సూచించాడు. అనంతరం మృతుడు రాజశేఖర్, లక్ష్మణలు నడిచి వస్తుండగా గెడ్డకంచరాం గ్రామ కూడలి వద్ద మృతుడు రాజశేఖర్, ముద్దాయి గొల్లబాబు ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో రాజశేఖర్ కడుపులో పదునైన కత్తితో గొల్లబాబు పొడిచాడు. దీంతో వెంటనే లక్ష్మణ్ తన బైక్‌తో జి.సిగడాం ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో శ్రీకాకళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 25న మృతి చెందాడు. మృతుడు భార్య హరిప్రియ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
మారణాయుధాలు స్వాధీనం
మృతుడు రాజశేఖర్‌తో గత కొన్ని రోజులుగా ముద్దాయి శంకర్‌కు గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆగస్టు నెలలోనే హత్య చేసేందుకు ఆన్‌లైన్ ద్వారా పదునైన కత్తిని కొనుగోలు చేశాడు. దీంతో హత్యకు ఉపయోగించిన కత్తిని ఎస్‌ఐ మధుసూదనరావు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో ముద్దాయి ఇంటి చుట్టూ తనికీ చేశారు. హత్య జరిగిన వారం రోజుల్లోనే ముద్దాయితో పాటు ఆయుధాలను సేకరించి, సోమవారం అరెస్టు చేసి కోర్టులో హజరు పరచడంపై జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం జి.సిగడాం ఎస్‌ఐ వై.మధుసూదనరావును అభినందించారు.

పఽథకం ప్రకారమే రాజశేఖర్ హత్య