
సమస్యలతో సతమతం
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
యూనివర్సిటీలో సౌకర్యాల కొరత
కన్నెత్తి చూడని కూటమి నేతలు
ఏడాదిన్నరగా జరగని పాలక మండలి సమావేశాలు
విద్యుత్, వసతి సమస్యలతో విద్యార్థుల ఇబ్బందులు
సమావేశాలకు గైర్హాజరౌతున్న స్థానిక నేతలు
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీని కూటమి పాలకులు గాలికొదిలేశారు. మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎవరు ముందుకు వస్తే ఎవరినెత్తిన భారం పడుతుందోనని కూటమి పాలకులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక్కడ ప్రతి ఏడాది మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా మహిళా వసతి గృహాలు లేవు. ప్రస్తుతానికి రెండు వసతి గృహాలు అవసరమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు విద్యుత్, మైదానం వంటి సమస్యలు వేధిస్తున్నాయి.
పాలకమండలి సమావేశాలకు మోక్షమెప్పుడో?
వర్శిటీ పాలకమండలి సమావేశాలను ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా సమావేశాలను నిర్వహించలేదు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి ఇవ్వాలి. ఇప్పటి వరకూ ఈ సమావేశాలకు ఎటువంటి ఆదేశాలను ఉన్నత విద్యామండలి జారీ చేయకపోవటంతో సమావేశాలు నిర్వహించలేదు. పాలక మండలి సమావేశం జరిగితే వర్శిటీ సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలను చేపట్టేందుకు ఆస్కారముంటుంది.
వేధిస్తున్న విద్యుత్, వసతి సమస్యలు..
వర్సిటీలో ముఖ్యంగా విద్యుత్, వసతి సమస్యలు వేధిస్తున్నాయి. విద్యార్థినులకు రెండు వసతి గృహాలు అవసరం కాగా కనీసం ఒక్కటైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వర్శిటీకు ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా లైన్ లేదు. ఎచ్చెర్లలో కరెంట్ పోతే వర్శిటీలో కూడా విద్యుత్ ఉండటం లేదు. దీంతో కంప్యూటర్లు కోర్సు చదివే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించడానికి కూడా వీలులేకుండా పోతోంది. అందుకే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 11 కె.వి.స్మాల్ సబ్‌స్టేషన్‌ను వర్శిటీలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పట్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఉన్న కళావెంకటరావు ఇక్కడ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత మర్చిపోయారు. విద్యార్థులకు సరిపడా మైదానం లేదు. ట్రాక్, పోల్స్ లేవు. ఆటలు ఆడుకునేందుకు వీలుగా మైదానం లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.
ముఖం చాటేస్తున్న స్థానిక నేతలు..
అంబేద్కర్ వర్శిటీలో చేపడుతున్న కార్యక్రమాలకు స్థానికుల నాయకులకు ఆహ్వానం పంపిస్తున్నా వారు గైర్హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సమావేశాలకు హాజరైతే వర్శిటీ సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తారని, వాటిని పరిష్కరించాల్సి వస్తుందని హాజరుకావడం లేదని సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్థానిక నేతలు వర్శిటీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై సమస్యలను పరిష్కరించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు.