
రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా సునీల్ శర్మ
శ్రీకాకుళం కల్చరల్: సేవ్ టెంపుల్స్ భారత్ రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా నగరానికి చెందిన తెన్నేటి సునీల్ శర్మను నియమితులయ్యారు. ఈమేరకు విశాఖలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సునీల్ శర్మకు అధ్యక్షుడు కేశినేని శ్రీనివాస్ (గజల్) నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, గోరక్షణ, మఠాలు, పీఠాలు, సాధువులు, సంతుల పరిరక్షణకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
ఆపదలో అండగా..
కంచిలి: సోంపేట పట్టణానికి చెందిన పొట్నూ రు సాయిరోహిత్ కాలేయం పాడవ్వడంతో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కంచిలి పట్టణ కళింగ కోమటి సంఘం సభ్యులు రూ.1,65,211 సాయాన్ని ఆదివారం అందించారు. అంతకుముందు కూడా కొంత మొత్తాన్ని అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సాయిరోహిత్ తల్లిదండ్రులు, సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
చెట్టుకొమ్మ విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం
జలుమూరు: సురవరం పంచాయతీ దొంపాక వద్ద ఆదివారం వేకువజామున ఎల్.కె.రోడ్డుపై మర్రి చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఉదయం పది గంటల వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో కూడా ఇదే రోడ్డు మీద ఓ చెట్టు కొమ్మ విరగడంతో అప్పుడు కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తరచూ ఇదే చెట్టు నుంచి కొమ్మలు పడటంతో వాహన చోదుకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రోడ్డు మీదుగా వందలాది ద్విచక్ర వాహనాలు, పాదచారులు, పొలం పనులకు వెళ్లే రైతులు రాకపోకలు సాగిస్తుంటారు.
సత్ప్రవర్తనతో మెలగాలి
శ్రీకాకుళం క్రైమ్ : రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని.. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇరత ఆర్థిక లావాదేవీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ హెచ్చరించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పేకాట, బెట్టింగ్, గంజాయి సేవనం, క్రయ విక్రయాలు, బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్సు చేయడం, వినాయక ఉత్సవాల్లో వర్గ విభేదాలు సృష్టించి అల్లర్లకు పాల్పడటం వంటివి తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆనందరావుకు సత్కారం
టెక్కలి: వసతి గృహం సంక్షేమాధికారిగా సత్తారు ఆనందరావు చేసిన సేవలు ఎనలేనివని వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమాధికారి టి.త్రినాథరావు కొనియాడారు. సంతబొమ్మాళి మండలం నౌపడ వసతి గృహం సంక్షేమాధికారిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సత్తారు ఆనందరావు, అరుణకుమారి దంపతులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఓవైపు వసతి గృహం సంక్షేమానికి కృషి చేస్తూ మరో వైపు అసోషియేషన్ బాధ్యతల్లో కీలకంగా పనిచేస్తూ అందరి మన్ననలను పొందిన వ్యక్తి ఆనందరావు అని కొనియాడారు. అనంతరం ఆనందరావు, అరుణకుమారి దంపతులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహం సంక్షేమాధికారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.గురువులు, వార్డెన్లు డి.రామారావు, గ్రామపెద్దలు కె.విష్ణుమూర్తి, వి.కృష్ణారావు, కెప్టెన్ ఎం.మన్మధరావు, ఎస్.కరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా సునీల్ శర్మ

రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా సునీల్ శర్మ

రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా సునీల్ శర్మ