
శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణం
గర్భగుడిలో బాబా పాదుకలు
జలుమూరు:
లోక కల్యాణం కోసమే శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణం నిర్వహించామని సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు అన్నారు. ఆదివారం శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణంలో పాల్గొని మాట్లాడారు. మానవాళికి ప్రేమ, సేవా మార్గాలును దశా దిశ నిర్దేశం చేసిన సాయి అందరిలోనూ ఉన్నాడన్నారు. మానవ సేవయే మాధవసేవ అని తలచి సాయి చేసిన సేవలు, లీలలు కొనియాడారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రతినిధులు కస్తూరి భాస్కర్ ప్రసాద్, తోట అరుణ, రాఘవరావు, విశ్వనాథరెడ్డి, జె.శాంతి, దుర్గాప్రసాద్, శ్రీదేవి, కిషోర్, గౌతమ్‌సాయి ఫణీంధ్ర, జిల్లా రైస్ ఇన్‌చార్జ్ పైడిశెట్టి వెంకటరమణ, సర్పంచ్ టి.సతీష్‌కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, గ్రామపెద్దలు బి.వి.రమణ, అర్చకులు నాయుడుగారి రాజశేఖర్, వెంకటాచలం, భక్తులు పాల్గొన్నారు.
శ్రీముఖలింగంలో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏకాదశ రుద్రపారాయణం వివాదంగా మారింది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో బాబా పాదుకలు గర్భగుడిలో శివుని మూలవిరాట్టు స్వయం భూ లింగం వద్ద పెట్టడంతో పలువురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వాంతర్యామి అయిన ఆ దేవదేవుడి లింగం వద్ద పాదుకలు ఎలా పెడతారని అర్చకులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు ఈఓ వాసుదేవరావును ప్రశ్నించారు. దీనిపై ఈఓ స్పందిస్తూ వివరణ కోరగా రుద్రపారాయణం నిర్వహిస్తామని సత్యసాయి భక్తులు అడిగితే అనుమతి ఇచ్చామని, ఇలా పాదుకలు గర్భగుడిలో పెడతారని తెలియదన్నారు. కొందరు బాబాభక్తులు అత్యుత్సాహంతో పాదుకులు లోపల పెట్టడం తప్పేనని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పాదుకలు తొలగించామని తెలిపారు. కాగా, ఈ వివాదంపై ఆలయ అర్చకులు, ఈఓ నిర్లక్ష్య వైఖరిపై గ్రామానికి చెందిన భక్తులు కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణం