
రిమ్స్‌లో కొరవడిన నిఘా!
● 650 పడకలకే సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఒప్పందం ● ఆస్పత్రిలో ఉన్న పడకల సంఖ్య 930 ● పర్యవేక్షణ లేక తరచూ దొంగతనాలు
శ్రీకాకుళం : నగరంలోని రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో నిఘా కొరవడుతోంది. నిత్యం ఏదో ఒక వార్డులో రోగులు, రోగుల సహాయకులకు సంబంధించిన సెల్‌ఫోన్లు, డబ్బులు, మోటారు సైకిళ్లు చోరీకి గురికావడం పరిపాటిగా మారింది. దొంగతనాలకు సంబంధించి ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కొందరు రోగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కూడా పాఠకులకు తెలిసిందే. తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు చెబుతున్న అది కూడా ఆత్మహత్య అని రిమ్స్ వర్గాల నుంచే వినిపిస్తోంది. కారణం ఏదైనప్పటికీ నిఘా కొరవడంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇదేం లెక్క?
రిమ్స్ సర్వజన ఆసుపత్రి 930 పడకల స్థాయిలో ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయిలో జరిగిన సెక్యూరిటీ ఒప్పందం మాత్రం 650కు మాత్రమే జరిగింది. రాష్ట్రస్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం ఈ ఒప్పందం జరిగినట్లు కొందరు రిమ్స్ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తొలుత 650 పడకలకు సెక్యూరిటీ ఒప్పందం జరిగినా అటు తర్వాత మరో వంద పడకలకు పెంచుతూ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రస్థాయిలో 750 పడకలకు లెక్కలు ఉండాలి. ఇందుకు భిన్నంగా 650 పడకలకే లెక్కలు ఉన్నట్లు చెబుతూ ఆ మేరకే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో రిమ్స్ పడకల స్థాయి 930కి చేరింది. ఈ కారణంగానే అప్పట్లో 930 స్థాయికి సెక్యూరిటీని పెంచలేకపోయారు. అటు తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం 930కి కాకపోయినా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు 750 పడకలకు కూడా సెక్యూరిటీ ఒప్పందాన్ని కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పర్యవేక్షణ గాలికి..
రిమ్స్లో నిఘా సిబ్బంది సక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పడకల స్థాయి కంటే సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ వారితో సైతం సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోలేకపోతున్నారు. నిఘాను పర్యవేక్షించాల్సిన అధికారి తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో ఇటువంటి పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ అధికారి తన జాబ్ జార్టును వదిలి ఇతర రిమ్స్ అధికారుల విధుల్లో తలదూర్చడానికి ప్రాధాన్యత ఇస్తుంటారని రిమ్స్ వైద్యులే బహిరంగంగా చెబుతున్నారు ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి సక్రమంగా నిఘా అమలయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.