
మహిళ అనుమానాస్పద మృతి
ఆమదాలవలస: పురపాలక సంఘం పరిధిలోని 12వ వార్డు చంద్రయ్యపేట వీధిలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీపాన రమణమ్మ (42) అనే మహిళ భర్త సింహాచలంతో కలిసి చంద్రయ్యపేటవీధిలో నివాసముంటోంది. సింహాచలం వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో శనివారం ఉదయం విధులకు వెళ్లిపోయారు. ప్రతిరోజూ స్థానికులతో కలిసి ఈవినింగ్ వాక్‌కు వెళ్లే రమణమ్మ శనివారం రాకపోవడంతో ఆమె భర్తకు సమాచారం అందించారు. అతను స్కూల్ నుంచి ఇంట్లోకి వెళ్లి చూడగా మంచం పక్కన గచ్చుపై విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్సై సనపల బాలరాజు తెలిపారు. రమణమ్మ బ్రెయిన్ స్ట్రోక్‌తోనే మృతి చెందినట్లు పోస్టుమార్టంలో నిర్ధారించినట్టు విశ్వసనీయ సమాచారం.