
వ్యాపారి అదృశ్యంపై ఫిర్యాదు
నరసన్నపేట: స్థానిక లక్ష్మున్నపేటకు చెందిన వ్యాపారి వెంకట పార్వతీశం గుప్త అదృశ్యమయ్యారు. ఆగస్టు 26న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని సోదరుడు మన్మధరావు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గుప్త అదృశ్యం వెనుక పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుప్తా బంగారు ఆభరణాలు ఒక చోట నుంచి మరొక చోటకు తరలిస్తుండటం, వ్యాపారులకు ఇస్తుండటం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండంతో పాటు లక్షల్లో లావాదేవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మంగళవారం తన కారులో స్థానిక పురుషోత్తంనగర్‌కు చెందిన కారు డ్రైవర్‌తో కలిసి విశాఖ వెళ్లగా.. డ్రైవర్ ఆ రాత్రే ఇంటికి చేరుకున్నారని, గుప్తా మాత్రం రాలేదని సమాచారం. సోదరుడు ఫోన్ చేస్తే వేరే వ్యక్తి లిఫ్ట్ చేసి తనకు బస్సులో ఫోన్ దొరికిందని చెప్పారు. ఆయన చెప్పిన చోటకు వెళ్లి ఫోన్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, విశాఖ పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.
శ్రీకాకుళం కల్చరల్: యువ రచయితల వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితా పొటీల్లో విజేతల వివరాలను వేదిక అధ్యక్షులు తంగి యర్రమ్మ ఆదివారం ప్రకటించారు. గుణుపు శార్వాణి (పాతపట్నం) ప్రథమ, తలగాపు ధనుంజయ (పలాస) ద్వితీయ, ముట్నూరు బాల సుబ్రహ్మణ్యం (ఎల్‌ఎన్‌పేట) తృతీయ బహుమతికి ఎంపికయ్యారని తెలిపారు. కూన రంగనాయకులు, కాపురెడ్డి శ్రీనివాస్‌లకు కన్సొలేషన్ బహమతులు వచ్చాయని చెప్పారు. వీరికి త్వరలోనే బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. డాక్టర్ పిలకా శాంతమ్మ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ తులాల సవరమ్మలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.