
సర్కారు బడిలో కంప్యూటర్ ల్యాబ్
● పూర్వ విద్యార్థి ఔదార్యం
గార:
తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో రూ.1.50 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలిచారు పూర్వ విద్యార్థి బొంది రమణ. గార మండలం కె.మత్స్యలేశం ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్‌కు అదే గ్రామానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి రమణ ఆరు కంప్యూటర్లతో పాటు ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయగా ఆదివారం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ శశిభూషణ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా సర్కారు బడిలో చదివే విద్యార్థుల కోసం ల్యాబ్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. దాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ చైతన్య, సర్పంచ్ బుడ్డా లలిత ఎర్రన్న, సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, హెచ్‌ఎం టి.సుధీర్‌కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ లక్ష్మీ, మైలిపిల్లి సూర్యనారాయణ, తులసీరావు తదితరులు పాల్గొన్నారు.