
ఒకే మాట.. ఒక్కటే విగ్రహం
● తిప్పనపుట్టుగలో ఒక్కటే విగ్రహం ● ఐకమత్యంగా వినాయక చవితి ● 57 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ
ఇచ్ఛాపురం రూరల్:
వీధికో విగ్రహం.. వాడకో మండపం కొలువుదీరుతున్న రోజుల్లో 57 ఏళ్లుగా ఆ ఊరి వారు ఒకే మాటపై నిలబడ్డారు. ఒక్కటే విగ్రహాన్ని పెట్టి ఐకమత్యంగా పూజలు చేస్తున్నారు. ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన గ్రామం తిప్పనపుట్టుగ. పేరుకే రెండు మండలాల గ్రామస్తులు. గ్రామం ఒక్కటే కావడంతో అందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు చేస్తూ తమలో ఐక్యతను చాటుకుంటుంటా రు. పన్నెండువందల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 57 ఏళ్ల కిందట పెద్దలు నిర్ణయించిన విధంగానే స్థానిక బస్టాండ్ మర్రిచెట్టు కింద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా రెండు మండలాలకు చెందిన ప్రజలు కలసి ఈ విగ్రహం వద్దే పూజలు నిర్వహిస్తా రు. మండపం వద్ద డీజేలు, నృత్యాలు కాకుండా సామూహిక కుంకుమ పూజలు, భజనలు, మండల స్థాయిలో కబడ్డీ, క్విజ్ పోటీలు, కోలాటాలు, రేలారే లా వంటి జానపద నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహిస్తుంటారు.
ఊరంతా నారీకేళ, కదళీ ఫలాలు
ఉద్దానం ప్రాంతం కావడంతో ఈ గ్రామానికి చెందిన రైతులు వినాయక చవితి ఉత్సవానికి బహుమతిగా ప్రతి ఒక్క కొబ్బరి రైతు ఒక్కో కొబ్బరి గెలను, తమ తోటల్లో పండించే అరటి గెలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వీటిని గ్రామ పొడుగునా రెండు వైపులా అలంకరించడం ఇక్కడ ప్రత్యేకత. విగ్రహం నిమజ్జనం అనంతరం కొబ్బరి కాయలు, అరటి గెలతో ఒకే ప్రాంతానికి చేర్చి వీటితో పాటు లడ్డూను వేలం వేస్తారు. ఆ మొత్తాన్ని అన్నదానం, వచ్చే ఏడాది చవితి ఉత్సవాలకు వినియోగిస్తారు.
గ్రామస్తులంతా కలసిమెలసి ఉండాలన్న ఉద్దేశంతో నా చిన్నతనంలో గ్రామ పెద్దలు గ్రామంలో ఒకే వినాయక విగ్రహం ఉండాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం.
– తిప్పన దాలయ్యరెడ్డి, గ్రామ పెద్ద, తిప్పనపుట్టుగ
గ్రామంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తాం. మండలాలు రెండైనా.. గ్రామం ఒక్కటే కావడంతో అందరం కలసి మెలసిగా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటాం. ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతాం. గ్రామంలో నిర్వహించే పండగలను కూడా అలాగే నిర్వహిస్తుంటాం.
– డాక్టర్ రత్నాల తారకేశ్వరరావు, పూజా కమిటీ సభ్యుడు, తిప్పనపుట్టుగ

ఒకే మాట.. ఒక్కటే విగ్రహం

ఒకే మాట.. ఒక్కటే విగ్రహం

ఒకే మాట.. ఒక్కటే విగ్రహం