
కొత్తూరు, హిరమండలం ఎస్‌ఐలకు వీఆర్
శ్రీకాకుళం క్రైమ్ :
జిల్లాలోని కొత్తూరు సర్కిల్ పరిధిలో కొత్తూరు, హిరమండలం ఎస్‌ఐలను జిల్లా పోలీసు కార్యాల యానికి వీఆర్ అటాచ్ చేస్తూ అధికారులు ఆదివా రం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఎస్‌ఐలు మహ్మద్ అమీర్ అలీ, మహ్మద్ యాసిన్‌లను వీఆర్ అటాచ్డ్ స్పెషల్ బ్రాంచికి బదిలీ చేశారు. కొత్తూరు ఎస్‌ఐ మహ్మద్ అమీర్ అలీ ఇదే నెలలో మండలంలోని శోభనాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టడంతో యువకుని బంధువులు, కుటుంబ సభ్యులు ఎస్పీ మహేశ్వరరెడ్డికి నేరుగా వెళ్లి ఫిర్యా దు చేసిన సంగతి తెలిసిందే. యువకుడు వెంకటరమణ అదే గ్రామంలో కొండపై భారీ పేలుళ్లతో క్వారీ నడుపుతున్న వారిని ప్రశ్నించడం, అక్కడ వాగ్వాదం జరగడం, ఆపై స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కొట్టడం పాఠకులకు విదితమే. హిరమండలం ఎస్‌ఐ మహ్మద్ యాసిన్ మండలంలో ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో రెండు వర్గాలు కొట్టుకునే కేసులోను, ఇతర పరిపాలన పరమైన అంశాల్లో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తప్పు చేస్తే చర్యలు తప్పవు..
ఎస్పీ మహేశ్వరరెడ్డి తమ విభాగంలో ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. ఇటీవలి కాలంలో గార ఎస్‌ఐ జనార్ధనరా వు, ఇచ్ఛాపురం రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు, జి.సిగడాం ఎస్‌ఐ మధుసూదనరావులను వీఆర్‌కు పంపగా.. రౌడీషీటర్లతో కలాపాలు సాగించారని శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ రాముపై శాఖాపరంగా విచారణ జరిపారు. జి.సిగ డాం ఎస్‌ఐ మధుసూదనరావు డీఆర్‌వలస గ్రామంలో శనీశ్వర ఆలయంలోని నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేసిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించార నే కారణంతో వీఆర్‌కు పంపినా తిరిగి అదే కేసును ఛేదించడంతో ఇప్పుడు అదే మండలానికి ఎస్‌ఐగా కొనసాగుతున్నారు. జిల్లాలో మరో ముగ్గురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐల పైన వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారి వద్ద చిట్టా ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది.