
బార్లకు ముగిసిన డ్రా
● ఐదు బార్లకు లైసెన్సులు కేటాయింపు ● దరఖాస్తులు ఎక్కువగా పడక వెలవెలబోయిన అంబేడ్కర్ ఆడిటోరియం
శ్రీకాకుళం క్రైమ్ : ఎకై ్సజ్ శాఖ బార్ పాలసీలో భాగంగా జిల్లాలో ఐదు బార్లకు లాటరీ పద్ధతిన లైసెన్సుదారులను అధికారులు నిర్ణయించారు. శనివారం ఉదయం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలతో డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో టోకెన్ డ్రా పద్ధతిన లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగం నుంచి జిల్లా డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ఎ కై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం కార్పొరేషన్, పలాస–కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో జనరల్ కేటగిరీలో 17 బార్లకు గాను, రిజర్వ్ కేటగిరీలో (గీతకులాలవారికి) 2 బార్లకు గాను దరఖాస్తులు కోరగా 22 దరఖాస్తులే వచ్చాయన్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురంలో ఒక్క దరఖాస్తు కూడా పడకపోగా, శ్రీకాకుళంలో 3 జనరల్ కేటగిరీ, ఒక రిజర్వ్ కేటగిరీ (శ్రీశయన)కి, పలాస–కాశీబుగ్గలో ఒక రిజర్వ్ (సొండి) కేటగిరీకి దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ విధంగా చూసుకుంటే శ్రీకాకుళంలో 16 దరఖాస్తులు రాగా, పలాసలో ఆరు వచ్చాయని, ఒకే వ్యక్తి నాలుగు దరఖాస్తులు వేసిన సందర్భాలు రెండు చోట్ల ఎదురయ్యాయన్నారు.
వెలవెలబోయిన ఆడిటోరియం..
బార్ల లైసెన్సు డ్రాలో దరఖాస్తుదారులకంటే ఎకై ్సజ్ సిబ్బందే ఎక్కువ ఉండటం గమనార్హం. కూటమి పార్టీలకు చెందిన మ ద్యం సిండికేట్ ముందస్తుగా వేసుకున్న ప్రణాళికతోనే టెండర్లు వేయలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే ఆమదాలవలస, ఇచ్ఛాపురం, కాశీబుగ్గల్లో జనరల్‌లో ఒక్క అప్లికేషన్ కూడా రాలేదన్నారు. పడని వాటికి తర్వాత మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు చెబు తున్నా టీడీపీ నాయకులు టెండర్లు వేయకుండానే తక్కువ డిపాజిట్లతో దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.