
రుషికొండపై చేసిన విమర్శలు గుర్తున్నాయా..?
చంద్రబాబు, పవన్ డ్రామాలు కట్టిపెట్టాలి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట:
ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, విశాఖ వచ్చిన కూటమి నాయకులు మరోసారి దీన్ని రుజువు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విభాగాలుగా విభజించి ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీనిపై కూటమి నాయకులు స్పందించలేదని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌పై ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన నాయకులు ఇప్పుడు పెదవి విప్పాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ఒకే విధానంపై ఉందని గుర్తు చేశారు. ఆనాడే అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశామన్నారు. విశాఖ ప్రజలు కూటమి నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రుషికొండ భవనాలపై విషం కక్కిన నాయకులు ఇప్పుడు వాటిని వాడుకోవడానికి పోటీ పడుతున్నారని తెలిపారు. అప్పట్లో జగన్ ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేసి, ఇప్పుడు భవనాల వద్ద ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. జగన్ ప్యాలెస్ అన్న నాయకులు జీఓలో ఎందుకు అలా పెట్టలేదని ప్రశ్నించారు. కూటమి నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు.