అండర్ పాసేజ్‌లు ఎవరి కోసం నిర్మించారో అర్ధం కావడం లేదు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వీటి వల్ల కష్టాలు రెట్టింపయ్యాయి. వర్షం పడిన ప్రతిసారి రోజుల తరబడి చిక్కాలవలస వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో వాహనాలను రైల్వే ట్రాక్ పైనుంచే తీసుకెళ్లాల్సి వస్తోంది. రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు.
– ఎం. లక్ష్మునాయుడు, చిక్కాలవలస
వర్షం పడిన ప్రతిసారీ ఇబ్బందులు పడుతున్నాం. వాహనాలు నడపలేకపోతున్నాం. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయినా రైల్వే శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా కష్టాలకు వదిలేయడం అన్యాయం. మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి నీరు నిల్వ లేకుండా చూడాలి.
– కింతలి విశ్వనాథం, దాసరివానిపేట
నరసన్నపేట : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది రైల్వే అండర్ పాసేజ్‌ల పరిస్థితి. రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనచోదకుల నిరీక్షణకు తెరదించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ అండర్ పాసేజ్‌లు ఇప్పుడు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు పడేటప్పుడు నీటితో నిండిపోయి రాకపోకలకు వీలు లేకుండా చేస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనదారుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా అండర్ పాసేజ్‌లు నిర్మించింది. కొన్ని గంటల వ్యవధిలోనే అండర్ పాసేజ్‌లు నిర్మించామంటూ గొప్పగా చెప్పుకున్నారు. వీటిని నిర్మించేందుకు వారి ఆలోచన ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో ఇక్కడ ప్రజలు, వాహనదారులు పడుతున్న అవస్థలు మరోలా ఉన్నాయి. అండర్ పాసేజ్‌లు నిర్మాణం పూర్తయితే కష్టాలు తొలుగుతాయి అని వాహనదారులు ఆశించారు. అందుకు భిన్నంగా అవస్థలు మరింత పెరిగాయి. ‘అప్పడే బాగుండేది.. గేటు వేస్తే కొద్ది నిమిషాలు వేచి ఉండేవారం.. గేటు తీసి ఉంటే యథావిదిగా వెళ్లిపోయే వాళ్లం. ఇప్పుడలా కాదు. వర్షా కాలం వచ్చిందంటే రోజుల తరబడి అండర్ పాసేజ్‌లో నీరు నిలిచిపోయి రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి..’ అంటూ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్న వర్షం పడినా అండర్ పాసేజ్‌ల వద్ద నీరు నాలుగైదు అడుగుల మేర నిలిచిపోతోంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 15 రోజుల క్రితం పడ్డ వర్షానికి నాలుగు రోజులు రాకపోకలు నిలిచిపోగా వారం క్రితం పడ్డ వర్షానికి మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. అండర్‌పాసేజ్‌ల్లో చేరిన నీరు తొలగించేందుకు, నీరు చేరకుండా ఉండేందుకు రైల్వే శాఖ చేపట్టిన చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
నాలుగు అడుగుల మేర నీరు..
నరసన్నపేట మండలంలో ఆర్‌అండ్‌బీ రహదారిపై నడగాం, చిక్కాలవలస, కంబకాయల వద్ద, పంచాయతీరాజ్ రహదారిపై దాసరివానిపేట వద్ద అండర్ పాసేజ్‌లు నిర్మించారు. నడగాం, దాసరివానిపేట, చిక్కాలవలసల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం నీరు నాలుగైదు అడుగుల మేర నిలిచిపోతోంది. దీంతో రోజుల తరబడి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాసరివానిపేట రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించిన అండర్ పాసేజ్ అసంపూర్తిగా ఉంది. పైన రేకులు(రూఫ్) వేయలేదు. దీనిని నిర్మించే ముందు గ్రామస్తులకు రైల్వే శాఖ పలు హామీలు ఇచ్చింది. దాసరివానిపేట నుంచి ఉర్లాం రైల్వే స్టేషన్ వరకూ రోడ్డు వేస్తామని, పోలాకి చానల్‌కు డ్రైన్ నిర్మించి అండర్ పాసేజ్‌లో నీరు లేకుండా చేస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు.
కష్టాలు రెట్టింపయ్యాయంటున్న వాహనచోదకులు
రైల్వే అండర్ పాసేజ్‌లలో నిలిచిపోతున్న వర్షపు నీరు
రోజుల తరబడిన స్తంభించిపోతున్న వాహనాల రాకపోకలు
పట్టించుకోని రైల్వే అధికారులు
అవస్థలు డబుల్!
అవస్థలు డబుల్!