
రిజిస్టర్ పోస్ట్‌కు బ్రేక్
● స్పీడ్ పోస్టులో విలీనం చేస్తూ ఉత్తర్వులు
● 171 ఏళ్ల బంధానికి స్వస్తిపలుకుతూ పోస్టల్ శాఖ నిర్ణయం
● సెప్టెంబరు 1 నుంచి అమలు
హిరమండలం: అత్యంత పురాతన ప్రభుత్వరంగ సంస్థ పోస్టల్. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన ఈ తపాలా వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త పుంతలు తొక్కుతోంది. సంస్కరణల్లో భాగంగా ‘రిజిస్టర్ పోస్టు’ సర్వీసుకు స్వస్తి పలికింది. సుమారు 171 ఏళ్లు సేవలందిస్తున్న రిజిస్టర్ పోస్టు సర్వీసును ఈ నెల 30తో నిలిపివేశారు. దీనిని స్పీడ్ పోస్టులో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి స్పీడ్ పోస్టు విధానం మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జిల్లాలో 3 ప్రధాన, 64 ఉప, 507 బ్రాంచ్ పోస్టాఫీసులకు ఆదేశాలు వచ్చాయి.
ప్రధాన సమాచార వ్యవస్థగా..
మూడు దశాబ్దాల కిందట వరకూ బంధుమిత్రులకు కబురు పంపాలన్నా.. ముఖ్యమైన పత్రాలు చేరవేయాలన్నా పోస్టుకార్డు లేదా రిజిస్టర్ పోస్టు మాత్రమే ప్రధాన ఆశ్రయంగా ఉండేది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని కాలంలో ప్రజలతో పోస్టల్‌కు విడదీయరాని బంధం ఉండేది. ప్రభుత్వ శాఖలపరంగా అన్నిరకాల ఉత్తర ప్రత్యుత్తరాలు రిజిస్టర్ పోస్టు ద్వారా నడిచేవి. ఎందుకంటే దీనికి డెలివరీ ప్రూఫ్ ఉంటుంది. ఏదైనా కోర్టు నోటీసులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నోటీసులు అందుకున్న తరువాత అవతలి వ్యక్తికి అందినట్టు రశీదు పొందడం రిజిస్టర్ పోస్టు ప్రత్యేకత. ఇది చట్టపరంగా చాలా ఉపయోగపడుతుంది. ప్రధానంగా లీగల్ నోటీసులు, ఉద్యోగ నియామకాల అపాయింట్‌మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఇవి ఎంతో ఉపయోగంగా ఉండేవి.
సంస్కరణలో భాగంగానే..
పోస్టల్ శాఖలో అనేక మార్పులు సంతరించుకుంటున్నాయి. దేశీయ పోస్టల్ సేవలను క్రమబద్ధీకరించడం, పనితీరు మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడంలో భాగమే ఈ విలీనమంటున్నాయి పోస్టల్ వర్గాలు. స్పీడ్‌పోస్టు వేగవంతమైన డెలివరీకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పుడు రిజిస్టర్ పోస్టును స్పీడ్ పోస్టులో విలీనం చేయడం వల్ల డెలివరీలు మరింత వేగవంతం అవుతాయి. ముఖ్యంగా స్పీడ్ పోస్టు ద్వారా పంపించిన పార్సిల్, పత్రాలు ఎక్కడ? ఏ స్టేజ్‌లో ఉన్నాయి? అన్న స్టేటస్ చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు వివరాలు పొందవచ్చు. ఈ సౌకర్యం రిజిస్టర్ పోస్టులో లేదు. తాజాగా ఒకే సేవ ఉండడం వల్ల పోస్టల్ శాఖకు పని చాలా సులువు అవుతుంది. అయితే రిజస్టర్ పోస్ట్‌తో పోల్చుకుంటే స్పీడ్ పోస్టుకు చార్జీలు ఎక్కువే. రిజిస్టర్ పోస్టు కనీస చార్జీ రూ.26 ఉంటే స్పీడ్ పోస్టు చార్జీ రూ.41 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.
రిజిస్టర్ పోస్టు స్పీడ్ పోస్టులో విలీనం కావడం వాస్తవమే. సెప్టెంబరు 1 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుంది. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని పోస్టల్ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రజలకు వేగవంతమైన సేవలందించేందుకే పోస్టల్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
–జె.వెంకటేష్, పోస్టుమాస్టర్,
పాతపట్నం పోస్టాఫీసు

రిజిస్టర్ పోస్ట్‌కు బ్రేక్