
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు..
టెక్కలి రూరల్: స్థానిక అక్కపు వీధికి చెందిన మోనింగి శ్రీనివాసరావు(42) శనివారం తన ఇంటి సమీపంలోని రాతి బావిలో శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీనివాసరావుకు భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు. మసాల పౌడర్‌ల వ్యాపారం చేస్తుండేవాడు. మూడు రోజుల క్రితం పెళ్లిరోజు రావడంతో బయటకు వెళ్దామని భార్య చెప్పింది. అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన శ్రీనివాసరావు గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుంటుబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం శ్రీనివాసరావు ఇంటి సమీపంలో ఉన్న బావి వద్ద వ్యక్తి మృతదేహం తేలడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రాము బావిలో మృతదేహాన్ని బయటకు తీయించగా మృతుడు శ్రీనివాసరావుగా గుర్తించారు. శ్రీనివాసరావు తండ్రి మోనింగి ప్రభాకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో పడి విద్యార్థిని మృతి
మెళియాపుట్టి : దీనబంధుపురం పంచాయతీ గేదెలపోలూరు గ్రామానికి చెందిన 4వ తరగతి విద్యార్థిని చెరువులో పడి మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఒంటి పూట బడి నిర్వహించడంతో సవర రెజీనా(9) గ్రామంలోని చెరువులోకి స్నానానికి దిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో గానీ మునిగిపోయి చనిపోయింది. పోలీసులు గ్రామానికి చేరుకున్నప్పటికే మృతదేహం పూడ్చేశారు. ఫిర్యాదులు ఏమీ వద్దని వారించి గిరిజనులు పట్టుబట్టి పోలీసులను వెనక్కి పంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు.
దుబాయ్‌లో
కాగువాడ వాసి మృతి
పాతపట్నం : దుబాయ్(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో ఓ కంపెనీలో వెల్డర్‌గా ఉద్యోగం చేస్తున్న పాతపట్నం మండలం కాగువాడ వస్త్రపురి కాలనీకి చెందిన మొగల్ హుస్సేన్ సాహెబ్ (44) శనివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు భార్య సుల్తాన్ బేగం మొగల్‌కు, కుటుంబ సభ్యులు కంపెనీ నిర్వాహకులు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సాహెబ్‌కు భార్య, కుమారుడు ఆల్తాఫ్ మొగల్ ఉన్నారు.

అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు..