
ప్రతికూలతలు అధిగమిస్తేనే ‘వికసిత్ భారత్’
ఎచ్చెర్ల : సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, ప్రతికూలతలు, సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడే వికసిత్ భారత్ వంటి లక్ష్యాలను చేరుకోగలమని థామ్సన్ రివర్ యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ సోషల్‌వర్క్, హ్యూమన్ సైన్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ బాలనిక్కు (కెనడా) అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో ‘ఆచరణలో స్థితిస్థాపకత.. వికసిత్ బారత్–2047 కోసం సంబంధిత సంఘాల నిర్మాణం, విద్యార్థుల భాగస్వామ్యం’ అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. యువతరం నిర్దేశిత లక్ష్యాలను కలిగి ఉండి ఆశావాహ దృక్పథంతో ముందుకుసాగి దేశ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. వైస్ చాన్సలర్ ఆచార్య కె.ఆర్ రజని మాట్లాడుతూ మేధో సంపత్తి, ప్రగతిదాయక ఆలోచనపరులు విదేశాలకు వెళ్లకుండా భారత్‌లోనే సేవచేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యా విభాగం సమన్వయకర్త, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ జేఎల్ సంధ్యారాణి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వర్శిటీ రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనురాధ, ఎస్‌వో కె.సామ్రాజ్యలక్ష్మీ, అధ్యాపకులు హెచ్.సుబ్రహ్మణ్యం, ఎన్.శ్రీనివాసరావు, ఎన్.వి.స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.