
సహకార బ్యాంకులో నియామకాలు పూర్తి
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో ఖాళీల భర్తీ ప్రక్రియ శనివారంతో పూర్తయినట్లు డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న ఉద్యోగులకు శనివారం నియామక పత్రాలను అందజేశారు. డీసీసీబీలో 19 అసిస్టెంట్ మేనేజర్లు, 35 స్టాఫ్ అసిస్టెంట్‌ల నియామకం కోసం ఈ ఏడాది జనవరి 8న నోటిఫికేషన్ విడుదలైందని పేర్కొన్నారు. మే 5, 11వ తేదీలలో పరీక్షలు నిర్వహించగా 18 మంది అసిస్టెంట్ మేనేజర్‌లుగానూ, 31 మంది స్టాఫ్ అసిస్టెంట్లుగా అర్హత సాధించారని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం జిల్లాలో పలు డీసీసీబీ బ్యాంక్‌లలో ఖాళీగా ఉన్న చోట్ల జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చామన్నారు. బ్యాంక్ వ్యాపారం ప్రస్తుతం రూ.2610 కోట్లుగా ఉందని, వచ్చే మార్చి నెలాఖరు నాటికి రూ.3500 కోట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ సీఈవో డి.సత్యనారాయణ, జీఎం ఎస్‌విఎస్ జగదీష్, డీజీఎం ఎస్.రమేష్, మేనేజర్ దశరథ పాల్గొన్నారు.