
ఎరువుల కోసం కొట్లాట
సరుబుజ్జిలి : రొట్టవలస గ్రామ సచివాలయం వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 245 బస్తాల ఎరువులు(యూరియా) పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో ఉదయం నుంచే రైతులు పాసుపుస్తకాలు పట్టుకొని సచివాలయం వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి వేచి ఉన్నా పంపిణీ చేయకపోవడంతో రైతులతో కలిసి స్థానిక సర్పంచ్ మూడడ్ల భద్రమ్మ భర్త, వైఎస్సార్‌సీపీ మండల బూత్ కమిటీ అధ్యక్షుడు మూడడ్ల రమణ అధికారులను ప్రశ్నించారు. ఎటువంటి వివక్ష లేకుండా రైతులందరికీ ఎరువులు పంపిణీ చేయాలని కోరారు. దీనిపై అక్కడే ఉన్న కొందరు అనధికార వ్యక్తులు స్పందిస్తూ ‘మేమున్నది మీరు చెప్పినట్లు చేయడానికి కాదు.. మాకు నచ్చిన విధంగా మేం పంపిణీ చేస్తాం..’ అని చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పిడిగుద్దులుతో దాడులు చేసుకున్నారు. అరుపులు, కేకలతో ఏం జరుగుందో తెలియక రైతులు పరుగులు తీశారు. ఇంతలో మరికొందరు గ్రామస్తులు కర్రలు పట్టుకొనిరావడంతో స్థానిక మహిళా పోలీసు సరుబుజ్జిలి స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సచివాలయానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన..
ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. సర్పంచ్ భర్తగా రైతులకు ఎరువులు ఇవ్వాలని అడిగేందుకే వచ్చామని, గొడవలు పడటానికి కాదని బూత్ కమిటీ అధ్యక్షుడు మూడడ్ల రమణ చెబుతుండగా కానిస్టేబుల్ అడ్డుతగిలారు. సర్పంచ్ భర్తవా అయితే ఏంటి అంటూ గద్దించడంతో మరోసారి రైతులు ఆందోళనకు దిగారు.
బ్లాక్‌మార్కెట్‌కు ఎరువులు....
సచివాలయానికి వస్తున్న ఎరువుల వాహనాన్ని ఆమదాలవలస మండలం జొన్నవలస వద్ద నిలిపి సుమారు 70 నుంచి 80 బస్తాలను బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అందుకే ఎరువుల కొరత ఏర్పడిందని అంటున్నారు. మరోవైపు సచివాలయం బయటే కొంతమంది లిస్టులు తయారుచేసి ఎరువుల కోసం నగదు ముందుగానే వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
నిలిచిన పంపిణీ...
కొట్లాట నేపథ్యంలో ఎరువుల పంపిణీ విషయంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో రొట్టవలస, సూర్యనారాయణపురం, అవతరాబాద్ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.
రొట్టవలస సచివాలయం వద్ద ఉద్రిక్తత
సకాలంలో పంపిణీ చేయకపోవడంపై రైతుల ఆగ్రహం
సరఫరా చేయకుండా చేతులెత్తేసిన అధికారులు

ఎరువుల కోసం కొట్లాట