
చెంతనే పోలీసులు.. చింతలేని పేకాటరాయుళ్లు!
● పాతపట్నం పోలీసుస్టేషన్ సమీపంలోని కోర్టు కూడలి వద్ద ఖాళీగా ఉన్న ఒక ఇంట్లో కొన్ని రోజులుగా పేకాట శిబిరం నడుస్తోంది. స్థానిక సీఐ గానీ, ఎస్‌ఐ గానీ చర్యలు తీసుకోలేదు. సమాచారం జిల్లా అధికారుల దృష్టికి వచ్చింది. శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఆ బాధ్యత అప్పగించారు. ఇంకేముంది నిఘా పెట్టి దాడులు చేశారు. ఈ నెల 19న చేసిన దాడుల్లో ఏడుగురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.57,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వారిలో కుమార్, శ్రీను కీలక వ్యక్తులు. వీరిలో కుమార్ అప్పట్లో కాశీబుగ్గ టౌన్ సీఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి గురండిలో పేకాట శిబిరాల రైడ్‌కి వెళ్లగా.. ఒడిశా పరిధిలో దాడులు చేయడమేంటని ఏపీ పోలీసులపై తిరగబడ్డాడు. అలాంటి వ్యక్తి పాతపట్నం నడిబొడ్డున, పోలీసు స్టేషన్‌కు సమీపంలో పేకాట శిబిరాన్ని నడుపుతున్నాడంటే ఇక్కడి పోలీసుల ఉదాసీనత ఎలా ఉందో అర్థమవుతుంది.
● పాతపట్నం పోలీసుస్టేషన్ సమీపంలో పేకాట
● శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు చేస్తే తప్ప బయటపడని పరిస్థితి
● కాశీబుగ్గ పోలీసులపై గతంలో తిరగబడిన వ్యక్తే కీలక నిర్వాహకుడు
● గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసే
విషయంలో ఉదాసీనత
● ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో యాక్ట్ నమోదు!
● పేకాట శిబిరాలకు అడ్డాగా మారిన పాతపట్నం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
పేకాట శిబిరాలకు పాతపట్నం కేంద్రంగా నడుస్తోంది. కొన్నాళ్లుగా పాతపట్నంలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లోనూ రోజూ రూ.లక్షల్లో గేమ్ జరుగుతోంది. అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఎస్పీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. అప్పటికే పలు మార్లు శ్రీకాకుళం వన్‌టౌన్, టూటౌన్, జేఆర్‌పురం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఆమదాలవలస సర్కిల్ అధికారులతో పాటు పాతపట్నం సర్కిల్ అధికారులకు కూడా పేకాట శిబిరాలపై అప్రమత్తం చేయడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు. మీ పరిధిలో పేకాట శిబిరాలపై చర్యలు తీసుకోకపోతే నా స్టైల్‌లో దాడులు చేసి పట్టిస్తానని హెచ్చరించినట్టు కూడా తెలిసింది. అయినా పాతపట్నంలో తీరు మారలేదు.
ఉదాసీనత ఎందుకో?
టాస్క్‌పోర్స్ పోలీసులు పట్టుకున్న వ్యక్తులను స్థానిక పోలీసు స్టేషన్‌కు అప్పగిస్తే.. వారిపై తొలుత సాధారణ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, ఆ తర్వాత ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన గట్టిగా హెచ్చరించడంతో గేమింగ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్టు వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పేకాట శిబిరాల నిర్వాహకుల నుంచి ప్రతి నెలా పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి వెనక స్థానిక నేతల అండదండలు కూడా ఉన్నాయి. ఆ కారణం చేతనే పేకాట నిర్వాహకులు రెచ్చిపోయి శిబిరాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కారణమేదైనా పాతపట్నం పోలీసు స్టేషన్ సమీపంలోనే పేకాట శిబిరం నిర్వహిస్తూ ఉండటం, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
ఇదే పాతపట్నం సర్కిల్, పోలీసు స్టేషన్ పరిధిలోని కాగువాడ సమీపంలో మహేద్ర తనయ నది పక్కన పంపుషెడ్ వద్ద కూడా పేకాట శిబిరం నడుస్తోంది. దీనిపైనా స్థానిక పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఈ నెల 18న శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.7,580 నగదు స్వాధీనం చేసుకున్నారు.

చెంతనే పోలీసులు.. చింతలేని పేకాటరాయుళ్లు!