
శాకంబరిగా రాజరాజేశ్వరీ దేవి
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడివీధి ఉమారుద్ర కోటేశ్వర దేవాలయంలో రాజరాజేశ్వరీ అమ్మవారిని ఆషాఢ మాసం, మాస శివరాత్రిని పురస్కరించుకొని గురువారం శాకంబరిగా అలంకరించారు. అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తి, చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఉదయం అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఔట్‌పోస్టు టెండర్లు ఖరారు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అగ్నిమాపక కార్యాలయాల నిర్వహణకు సంబంధించి పొందూరు, మందస ఔట్ పోస్ట్ టెండర్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం తెరిచారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తక్కువ ఉన్న టెండర్లను ఖరారు చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక జిల్లా అధికారి జె.మోహనరావు, అటవీ శాఖ సబ్ డీఎఫ్‌ఓ నాగేంద్ర, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పద్యకవితా చక్రవర్తి జాషువా
శ్రీకాకుళం కల్చరల్: పద్య కవితా చక్రవర్తి గుర్రం జాషువా అని వక్తలు కొనియాడారు. సాహితీ స్రవంతి, శ్రీకాకుళ సాహితీ ఆధ్వర్యంలో కేంద్ర గ్రంథాలయం సమావేశ మందిరంలో గురువారం జాషువా వర్ధంతి సభ నిర్వహించారు. కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, ఆకాశవాణి కేంద్రం(విశాఖ) వ్యాఖ్యాత, రచయిత డాక్టర్ బండి సత్యనారాయణ ప్రసంగిస్తూ జాషువా ఆశయాలను, వర్తమాన స్థితిగతుల్ని వివరించారు. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కథానిలయం ట్రస్టు కార్యదర్శి దాసరి రామచంద్రరావు, రచయిత చింతాడ తిరుమలరావు, తెలుగు అధ్యాపకులు బాడాన శ్యామలరావు, రచయిత కలమట దాసుబాబు, డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్సు విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కె.శ్రీనివాసరావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం సహాయ కార్యదర్శి సుధాకర్, ప్రజా సాహితీ కార్యదర్శి పి.మోహనరావు, యువ రచయితల వేదిక అధ్యక్షులు తంగి ఎర్రమ్మ, సాహితీ స్రవంతి సభ్యులు కె.భుజంగరావు, పి.దివాకర్, ఎన్.రమణారావు, భానుప్రసాద్, కె.ఉదయ్‌కిరణ్, లీలావరప్రససాద్, పొన్నాడ వరాహ నరసింహులు, కవీశ్వరరావు, సిహెచ్ రామచంద్రరావు, సన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
31 మద్యం బాటిళ్లు స్వాధీనం
సారవకోట: మండల కేంద్రం సారవకోటలో వైన్‌షాపు నుంచి 31 మద్యం బాటిళ్లను తరలిస్తున్న కుమ్మరిగుంట గ్రామానికి చెందిన లక్కోజు వెంకటరావును టాస్క్‌ఫోర్స్ సిబ్బంది బుధవారం రాత్రి పట్టుకున్నారు. అనంతరం సారవకోట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపించినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ గురువారం తెలిపారు.
తప్పిన ప్రాణాపాయం
రణస్థలం: రణస్థలం కొత్త పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న కారును వెనుకనే వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు మలుపులు తిరుగుతూ లారీ ముందుభాగంలో ఉండిపోయి కొంతదూరం ముందుకు దూసుకొచ్చింది. లారీ డ్రైవర్ ఆప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. కారు డ్యామేజ్ అయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు.

శాకంబరిగా రాజరాజేశ్వరీ దేవి

శాకంబరిగా రాజరాజేశ్వరీ దేవి