
కొలిక్కిరాని కిట్లు లెక్క!
ఆదేశాలు బేఖాతరు..
సమగ్ర శిక్ష ఏపీసీ రాష్ట్ర జిల్లా అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ప్రాజెక్టులోని ఖాళీగా ఉన్న నాలుగు సెక్టోరియల్ పోస్టులకు తక్షణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించి సుమారు 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీసీలతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా రాష్ట్ర అధికారులు సెక్టోరియల్ అధికారుల నియామకానికి సంబంధించిన అంశంపై ఆదేశాలు జారీ చేయగా, జిల్లా కలెక్టర్ సైతం తక్షణం సెక్టోరియల్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశింనా ఫలితం లేకుండా పోయింది. సెక్టోరియల్ అధికారులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలపై పర్యవేక్షణ లేకుండా పోయింది.
శ్రీకాకుళం:
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు కావస్తున్నా జిల్లాలో నేటికీ అనేక మంది విద్యార్థులకు స్టూటెంట్ కిట్లు అందలేదు. జిల్లాకు సరిపడినన్ని కిట్లు వచ్చినప్పటికీ కొరత ఎందుకు ఏర్పడిందని, తక్షణం పాఠశాలల వారీగా విద్యార్థులకు సరఫరా జరిగిన కిట్లు సంఖ్యను తమ కార్యాలయానికి తెలియజేయాలని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు జిల్లా అధికారులకు ఆదేశించారు. అయితే ఈ వివరాలను సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు చెప్పలేకపోతున్నారు. పాఠశాలలపై పర్యవేక్షణ జరపాల్సిన సెక్టోరియల్ అధికారుల లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని ఏఏ పాఠశాలలకు బూట్లు, కిట్లు, యూనిఫామ్ ఎన్నెన్ని అవసరమన్నది చెప్పలేని స్థితిలో సమగ్ర శిక్ష ఏపీసీ సిబ్బంది ఉన్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన సీఎంఓ ఉన్నప్పటికీ ఆయనకి సైతం అవగాహన లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎంఈఓలపైనా ఆధారం..
జిల్లాలోని సుమారు 19 వేల మంది విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంం, బూట్లు, నోట్ పుస్తకాలు అందాల్సి ఉంది. ఎవరెవరికీ అవసరమో లెక్కలు తేల్చలేమని నిర్ణయానికి వచ్చిన సమగ్ర శిక్ష అధికారులు మంగళవారం ఎంఈఓలకు ఓ మెసేజ్ పంపించారు. పాఠశాలల వారీగా విద్యార్థులు సరఫరా అయిన కిట్లు సంఖ్యను కార్యాలయానికి తెలియజేయాలని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష వద్ద ఉండవలసిన సమాచారాన్ని ఎంఈఓ నుంచి సేకరించాలని ప్రయత్నాలు చేస్తూ ఉండటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రొటోకాల్ ఉల్లంఘన..
సమగ్ర శిక్ష ఏపీసీ ప్రొటోకాల్ సైతం ఉల్లంఘిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించగా గార ఉన్నత పాఠశాలకు కేంద్రమంత్రి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్తో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖకు సంబంధించిన అధికారులంతా హాజరైనప్పటికీ ఏపీసి మాత్రం అనారోగ్య కారణాలు చెబుతూ గైర్హాజరయ్యారు. ఆరోజు సెలవు పెడుతున్నట్లు చెప్పినప్పటికీ అదే రోజున ఉదయం 10:30 గంటలకు లావేరు మండలంలో జరిగిన పాఠశాల భవన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావడం గమనార్హం. ఆ రోజున కేంద్ర మంత్రి, జిల్లా అధికారులు హాజరయ్యే కార్యక్రమానికి వెళితే అక్కడ ఏర్పాట్లలో లోటుపాట్లు తలెత్తిన పక్షంలో వారి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందన్న భయంతో సెలవు పెట్టారని విద్యాశాఖ వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఊహించినట్లుగానే గారతోపాటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ డేకు చేసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సుమారు 19 వేల మంది విద్యార్థులకు అందని స్టూడెంట్ కిట్లు
వివరాలు కోరిన రాష్ట్ర అధికారులు
సమాచారం లేక చేతులెత్తేసిన సమగ్ర శిక్ష అధికారులు

కొలిక్కిరాని కిట్లు లెక్క!