
సమస్యల స్వాగతం
దేవదాయ మంత్రికి..
అరసవల్లి ఆదిత్యుని ఆలయం
అరసవల్లి: రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి రానున్నారు. శ్రీకూర్మంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై ఆదిత్యున్ని దర్శించుకునే అవకాశాలున్నాయన్న సమాచారంతో అరసవల్లి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. భక్తుల సౌకర్యాలపై ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయానికి తొలిసారి మంత్రి రానుండడంతో పలు సమస్యలు ఆయనకు స్వాగతం పలకనున్నాయి. ఎన్నడూ లేనంత అభివృద్ధి అంటూ అధికార పార్టీ ప్రకటనలు గుప్పిస్తుంటే.. ఎన్నడూ చూడని అరాచకం, విధ్వంసం అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి.. ఇప్పుడు ఆ ప్రస్తావనే చర్చల్లోకి రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా చాలావరకు పరిష్కరించకుండా వదిలేసిన పలు అంశాలను బాధితులు మంత్రి ఆనం ఎదుట వెల్లగక్కనున్నట్లుగా సమాచారం.
సిబ్బందితో ఇబ్బంది...!
అరసవల్లి ఆదిత్యాలయానికి గత కొన్నేళ్లుగా సిబ్బంది కొరత అతిపెద్ద సమస్యగా మారింది.గత ప్రభుత్వ హయాంలో సుమారు 49 మందిని దినసరి వేతనదారులుగా నియమించి ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాలు, అన్నదానం, ప్రసాదాలు, పారిశుద్ద్యం తదితర విభాగాల్లో నియమించారు. దీంతో ఎక్కడా అవస్థలు లేకుండా భక్తుల దర్శనాలు సాగాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఆ 49 మందిని తొలగించేసి త్రీమెన్ కమిటీ సూచనల ప్రకారం ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నియామకానికి ఆదేశించారు. ఇప్పటివరకు దాని ప్రస్తావనే లేకుండా పోయింది.వీరికి ఏప్రిల్ నుంచి జీతాలు నిలుపుదల చేశారు. స్వామి వారి కార్యక్రమాల్లో భజంత్రీలు వాయించే ఆరుగురిలో ముగ్గురు ఇంటిబాట పట్టగా..మరో ముగ్గురు కూడా జీతాలివ్వని కారణంగా వారు కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు.
దుకాణాలు కూల్చేసి విధ్వంసంగా....
రథసప్తమి రాష్ట్ర పండుగ చేశామంటూ ప్రకటించి ఆలయం ముందు దశాబ్దాలుగా ఉంటున్న దుకాణసముదాయాలు, అన్నదాన మండపం, సూర్యనమస్కారాల మండపం, ప్రసాదాల తయారి కేంద్రం, ప్రసాదాల విక్రయాల కౌంటర్లు, మరుగుడొడ్లు, వసతి గదులు, ఇతరత్రా శాశ్వత భవనాలన్నీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే కూల్చేశారు. ఆలయ అభివృధ్దికి దాతలు రూ.లక్షల్లో విరాళాలిచ్చి భక్తుల సౌకర్యానికై భారీగా జింకు రేకు షెడ్లు నిర్మించగా.. వాటిని దాతలకు కనీస సమాచారం ఇవ్వకుండానే కూల్చే యడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. రూ.100 కోట్లతో ‘ప్రసాద్’ స్కీం అంటూ హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్.. ఇప్పుడేమీ చెప్పలేక మిన్నకుండిపోతున్నారు. అసలు ‘ప్రసాద్’ స్కీం నిధులు రావని తెలిసినా బయటకు పొక్కకుండా అడుగులు వేస్తున్నారు.
అక్రమాలపై విజిలెన్స్ దాడులు..ఆదిత్యాలయంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణకు దిగారు. గతంలో ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్ హయాంలో రిటైర్డ్ ఈవో జగన్మోహనరావు, మరో జూనియర్ అసిస్టెంట్, ఓ ముగ్గురు దినసరి వేతనదారుల సహాయంతో దొంగ బిల్లుల ద్వారా ఆలయంలో వివిధ రకాలుగా ఖర్చులు చూపించి సుమారు రూ.2.50 కోట్ల వరకు తినేసారని విజిలెన్స్ గుర్తించింది. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాల్సి ఉంది.
నేడు శ్రీకూర్మం, అరసవల్లి ఆలయాలకు మంత్రి ఆనం రాక
ఓవైపు విజిలెన్స్ దాడులు..
మరోవైపు అభివృద్ధి పేరిట విధ్వంసం
సమస్యలను మొరపెట్టుకోనున్న పలువురు బాధితులు
మాస్టర్ ప్లానా..అదెక్కడ!
అరసవల్లి ఆదిత్యాలయానికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామని అప్పట్లో సీఎం చంద్రబాబు 2015లో ఇదే ఆలయంలో కూర్చుని ప్రకటించారు. ఇంద్రపుష్కరిణి అభివృధ్ది, ఆధునిక రూపురేఖలతో ఆలయ ప్రాకారం, మాడవీధుల విస్తరణ తదితర ముఖ్య పనులను నాలుగు ఫేజ్‌ల్లో ప్లాన్ వర్కౌట్ చేయాలని ఆదేశించారు. అయితే అసలు మాస్టర్‌ప్లాన్‌కు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించనే లేదు. గతంలో ప్రతిపాదించిన ల్యాండ్ బ్యాంకు, ల్యాండ్ టు ల్యాండ్ అమలుపై స్పష్టత కరువైంది. దీంతో ఆదిత్యాలయ భూములు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురౌతున్నాయి.