
ఇసుక అక్రమార్కులపై చర్యలేవీ?
● కొత్తవలసలో అనధికార ఇసుక ర్యాంపు మూసివేయాలి
● బాధితులతో కలిసి అక్రమ తవ్వకాలను
పరిశీలించిన మాజీ స్పీకర్ తమ్మినేని
ఆమదాలవలస: కొత్తవలస, పాతనిమ్మతొర్లువాడ, ముద్దాడపేట తదితర గ్రామాల పరిధిలో అనధికార ఇసుక ర్యాంపులను వెంటనే మూసివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల పరిధిలో నాగావళి నదిలో నిర్వహిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలను బుధవారం పరిశీలించారు. పాతనిమ్మతొర్లువాడ గ్రామస్తులపై ఇటీవల జరిగిన దాడిని ఖండిస్తూ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీగర్భంలో లోతుగా తవ్వకాలు చేపట్టడం దారుణమన్నారు. ఇలాంటి చర్యల వల్ల తాగునీటికి ముప్పు ఏర్పడుతుందన్నారు. అనధికార ర్యాంపుల వెనుక కూటమి పార్టీ ప్రముఖుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత నిమ్మతొర్లువాడ శ్మశాన వాటిక, మైదానం సమీపంలో తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులపై దాడులు జరగడం అమానుష చర్య అని, దాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక్కడి ఇసుక మాఫియా సీఎం చంద్రబాబునాయుడికి సంబంధించినదిగా చెబుతున్నారని.. చంద్రబాబు ఇదేనా నీ సుపరిపాలన అని ప్రశ్నించారు. కలెక్టర్ పరిశీలించి తక్షణమే ఇసుక ర్యాంపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షాల నేతలతో కలిసి ఉద్యమం చేపడతామని తమ్మినేని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి.సత్యనారాయణ, రాష్ట్ర కళింగ కుల విభాగం అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, యువ నాయకులు తమ్మినేని చిరంజీవినాగ్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, సర్పంచ్ సోమరాజు తేజ, నాయకులు ఎన్ని రామచంద్రయ్య, గురుగుబెల్లి అప్పలనాయుడు, బొడ్డేపల్లి మన్మధరావు, గొంటి కృష్ణ, బెండి జయరాం, తాండ్ర ధనుంజయరావు, మున్సిపల్ మాజీ వైస్ ఫ్లోర్‌లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పార్టీ యువజన విభాగం నాయకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.