
బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం నుంచి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వార్షిక క్రెడిట్ ప్లాన్ 2024–25, ఎంఎస్‌ఎంఈ, విద్యా రుణాలు, వ్యవసాయానికి క్రెడిట్, చెల్లింపులు, స్వయం సహాయక సంఘాల గ్రూపులకు లింకేజి, ఎంసీపీ డిజిటల్, పీఎం సూర్యఘర్, పీఎం విశ్వకర్మ, నాబార్డు తదితరు రుణాలపై బ్యాంకర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ, మత్స్య శాఖ, ఉద్యానవన శాఖ, తదితర శాఖల లక్ష్యాలపై ఆరా తీశారు. లీడ్ బ్యాచ్ మేనేజర్ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలను బ్యాంకర్లంతా అమలు చేయాలని సూచించారు. నాబార్డు డీసీ ఎం.రమేష్ కృష్ణ మాట్లాడుతూ కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండేలా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. సమావేశంలో యూబీఐ ప్రాంతీయ అధిపతి పి.రాజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.శ్రీనివాసరావు, డీసీసీబీ జనరల్ మేనేజర్ వరప్రసాద్, ఉద్యానవన శాఖ ఏడీ ప్రసాదరావు, నాబార్డ్ మేనేజర్ రమేష్‌కృష్ణ, మత్స్య శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ, ఏపీఎంఐపీ డీడీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి త్రినాథస్వామి, ఆయా బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
అప్రమత్తతతోనే నేరాల నియంత్రణ
శ్రీకాకుళం క్రైమ్ : అవగాహన, అప్రమత్తతతోనే నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థి దశలో సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని, మహిళా చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. శక్తియాప్ ఆవశ్యకత, గుడ్‌టచ్ – బ్యాడ్‌టచ్, బాల్యవివాహాల నియంత్రణపై అధికారులు సమీప విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చైల్డ్‌హెల్ప్‌లైన్ 1098, సైబర్ టోల్‌ఫ్రీ నంబర్ 1930, డయల్ 112 నంబర్లు గుర్తుపెట్టుకుని ఆపద సమయంలో వినియోగించాలన్నారు.
శాకంబరిగా మహాలక్ష్మి
బలగ అయ్యప్పస్వామి దేవాలయంలో మహాలక్ష్మీ అమ్మవారిని ఆషాఢ మాసం, మాస శివరాత్రి పురస్కరించుకుని బుధవారం శాకంబరిగా అలంకరించారు. అర్చకులు దేవరకొండ శంకరనారాయణశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– శ్రీకాకుళం కల్చరల్
స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దు
శ్రీకాకుళం అర్బన్: విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, వీటి వల్ల వినియోగదారులపై ఎలాంటి అదనపు చార్జీల భారం ఉండదని ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎన్.కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్‌డీఎస్‌ఎస్ పఽథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రారంభించిందని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల విషయంలోనూ ఎటువంటి అపోహలు వద్దన్నారు. ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1912కు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.