
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
ఎల్‌ఎన్ పేట: మండలంలోని చొర్లంగి గ్రామానికి చెందిన అగతముడి వెంకటేష్ (23) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, గ్రా మస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేష్ హైదరాబాద్‌లోని తన అక్క ఇంటికి వెళ్లేందుకు మంగళవారం రాత్రి ఫలక్‌నుమా రైలు ఎక్కాడు. మంగళవారం రాత్రి ఫలక్‌నుమా రైలు సుమారు నాలుగు గంటలకు పైగా ఆలస్యంగా వచ్చింది. అయితే ప్రమాదవశాత్తు విజయనగరం జిల్లా అంతకాపల్లి సమీపంలో వెంకటేష్ రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. బుధవారం తెల్లవారు జామున స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడి పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఫలక్‌నుమా రైలు హైదరాబాద్ చేరుకున్న తర్వాత జనరల్ బోగీలో మిగిలి ఉ న్న లగేజీ బ్యాగులను గుర్తించారు. అప్పటికే గుర్తు తెలి యని వ్యక్తిగా కేసు నమోదు చేసిన విజయనగరం రైల్వే పోలీసులు లగేజీలో ఉన్న సమాచారం ప్రకారం వెంకటే ష్ కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం తెలియజేశారు. మృతుని తండ్రి తిరుపతిరావు ఇతర కుటుంబ సభ్యులు విజయనగరం చేరుకుని తన కొడుకేనని గుర్తించారు. గురువారం సాయంత్రం మృతదేహాన్ని గ్రామానికి తీసుకుని వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
ఉద్యోగం సాధిస్తాడనుకుంటే..
మృతి చెందిన వెంకటేష్ బ్యాంక్ ఉద్యోగం సాధించేందుకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే నంధ్యాలలో కోచింగ్ తీసుకుంటున్నాడు. వారం రోజుల కిందటే నంధ్యాల నుంచి చొర్లంగి గ్రామానికి చేరుకున్నాడు. ఇటీవల జరిగిన బ్యాంక్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడని, ఇంటర్వ్యూ ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరి కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుందనుకున్నంతలోనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన యువకులు ఏబీ ప్రధాన రహదారి రావిచంద్రి నుంచి చొర్లంగి గ్రామం వరకు మృతదేహాన్ని ర్యాలీ గా తీసుకుని వెళ్లారు. మృతునికి తండ్రి, అమ్మ సుశీల, అక్క, తమ్ముడు ఉన్నారు.

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి