ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు విద్యాశాఖ సమాయత్తమైంది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీఓ నంబర్ 22తో షెడ్యూల్‌తోపాటు, మార్గదర్శకాలు జారీ చేసి న విషయం తెలిసిందే. రెండేళ్ల వ్యవధిలోనే జరుగుతున్న ఈ బదిలీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకునే పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు.
ఒకేచోట 8 ఏళ్లు పనిచేస్తే తప్పనిసరి బదిలీ..
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్లు, స్కూ ల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు ఇతర కేటగిరీ టీచర్లు 8 ఏళ్ల పాటు ఒకే స్టేషన్ (ఒకే పాఠశాల)లో పని చేస్తూ ఉంటే.. కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంది. అలాగే రిక్వెస్ట్ బదిలీ కోసం సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ ఉన్నత చదువులు (పీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్‌లు, పీహెచ్‌డీలు) పేరిట స్టడీ లీవ్ పేరుతో సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులు(ఆగస్టులోపు) 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే బదిలీ కానున్నారు.
బదిలీల కోసం 4198 పోస్టులు సిద్ధం..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రెగ్యులర్ టీచర్లు 12,121 మంది, మినిమమ్ టైం స్కేల్ టీచర్లు 364 మంది పని చేస్తున్నారు. జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా 458 మంది టీచర్లను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. బదిలీలకు ఉమ్మడి జిల్లాలో 4198 పోస్టులను ఖాళీగా విద్యాశాఖ చూపిస్తోంది. ఇందులో క్లియర్ వెకేన్సీలు 567, 8/5 అకడమిక్ ఈయర్స్ పూర్తి చేసుకున్నవారు 2,092 మంది ఉన్నారు. ఫారిన్ సర్వీసు టీచర్లు ఏడుగురు ఉన్నారు. పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఖాళీలు (రీ–అపోర్సిమెంట్ ఖాళీలు) 1,521, స్టడీలీవ్‌లో 10 మంది టీచర్లు ఇలా మొత్తం అన్నీ కలిపి 4198 పోస్టులను ఖాళీలు పాఠశాల విద్యాశాఖ చూపించింది.
ఎన్నో సందేహాలు..
● ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో జరిపిన చర్చల ప్రకారం ఇవ్వాల్సిన బదిలీ మార్గదర్శకాల్లో అనేక అంశాలపై స్పష్టత లోపించిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
● సర్వర్ డౌన్‌లో ఉంటుండటంతో ఆన్‌లైన్ చేయడంలో తీవ్రజాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
● ఇంగ్లిష్ మీడియంతో సమానంగా తెలుగు మీడియంను నిర్వహించాలన్న అంశంపై స్పష్టత లేదు.
● మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలన్న అంశంపై స్పష్టత లేదు.
● ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు పోస్టులు కొనసాగింపుపై స్పష్టత లేదు. ఆన్‌లైన్‌లో చూపించడంలేదు.
● ఎస్‌జీటీలతోపాటు హెచ్‌ఎంలు, ఎస్‌ఏలకు మా న్యువల్‌గా కౌన్సిలింగ్ జరపాలన్నదానిపై స్పష్టత లేదు.
● ఖాళీలను బ్లాక్ చేయకుండా ఉంచాలని, స్టడీ లీవ్ ఖాళీల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
● ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులను ఎస్‌జీటీలతోనే భర్తీ చేయాలన్న డిమాండ్‌పై స్పష్టత లేదు.
పారదర్శకంగా చేస్తాం..
ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిపించేలా కసరత్తులు చేస్తున్నాం. వివిధ ఖాళీల జాబితాలను రూపొందించాం. హెచ్‌ఎంలు, ఎస్‌జీటీలు, ఎస్‌ఏల ఖాళీలను ప్రదర్శిస్తాం. ఎస్‌ఏల బదిలీలు ఆన్‌లైన్‌లో చేపట్టనున్నాం. ఎస్‌జీటీలకు సంబంధించి మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉంది. బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్లు 9703148269, 8143142450, 9000907101ను సంప్రదించవచ్చు.
– డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య,
జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం
ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు


