
కోచింగ్ సెంటర్‌లో దారుణం
● విద్యార్థిని చితకబాదిన నిర్వాహకులు ● తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వ్యవహారం
నరసన్నపేట: స్థానిక ప్రశాంత్ నగర్‌లో కుందనా నవోదయ కోచింగ్ కేంద్రం నిర్వాహకులు విద్యార్థులను చితకబాదుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలను మంచిగా చదివిస్తామని నవోదయ ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధం చేస్తామని తల్లిదండ్రులను నమ్మించి జాయిన్ చేసుకున్నారు. తీరా అక్కడ విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతుండడంతో తల్లిదండ్రులు వీధికెక్కారు. దీంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పోలాకి మండలం ఈదులవలస గ్రామానికి చెందిన ముద్దాడ శ్రీనివాసరావు తన కుమారుడు శ్రీకర్‌ను కోచింగ్ కోసం కుందనా నవోదయ కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు. అయితే గురువారం అబ్బాయి ఇంటికి వచ్చాక స్నానం చేయిస్తున్నప్పుడు వీపు, చెవులుపై గాయాలు ఉండడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో విద్యార్థిని ప్రశ్నించగా కోచింగ్ సెంటర్‌లో టీచర్ కొట్టారని, చాలా అవమానకరంగా మాట్లాడారని తెలిపాడు.
పోలీసుల హెచ్చరిక
ఈ విషయంపై విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు కోచింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించగా అతడినే కొడతామని వారు సమాధానం చెప్పారు. దీంతో విషయాన్ని శుక్రవారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏఎస్‌ఐ సింహాచలం కోచింగ్ కేంద్రం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఇలా కొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న ఏబీవీపీ ప్రతినిధి మదన్‌కుమార్ కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చి నిర్వాహకులను నిలదీశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. బాలల హక్కులను కాలరాస్తున్న ఈ కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలబాలికలకు రోజుకు 10 గంటలకు పైగా శిక్షణనిస్తున్నారని తెలిపారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఘటనపై కోచింగ్ కేంద్రం నిర్వాహకుడు వైకుంఠరావు మాట్లాడుతూ.. అనుకోకుండా గట్టిగా దెబ్బ తగిలిందని, అంతేతప్ప కావాలని పిల్లలను ఇబ్బంది పెట్టలేదన్నారు.