
విద్యుత్‌కు వేసవి షాక్..!
పాతపట్నం: వేసవి వచ్చిందంటే ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి విద్యుత్ వినియోగాన్ని పెంచుకుంటాం. ఇంతవరకు బాగానే ఉన్నా కన్‌సీల్డ్ వైరింగా, గోడలపైనే గొట్టాల్లో వైరింగ్ ఏర్పాటు చేశారా, సరైన ప్రమాణాలతో తగిన మందం ఉన్న వైర్లు వైశారా అనేది అందరూ గుర్తించాల్సిన విషయం. వైరింగ్‌లో ఏవైనా లోపాలుంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తించాలి. రానున్న రోజుల్లో ఉష్ణాగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలతో పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అధిక లోడుతో అనర్థమే
వేసవి కాలంలో విరివిగా విద్యుత్ ఉపకరణాల వినియోగం వల్ల ఒక్కొక్కసారి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుంటాయి. గృహాల్లో, కార్యాలయాల్లో వాడుతున్న విద్యుత్ వాడకాన్ని బట్టి లోడ్‌ను నిర్ధారించుకుని ఆమేరకు విద్యుత్‌శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీంతో విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి వినియోగదారునికి అవసరమైన లోడ్‌ను ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లో విద్యుత్ శాఖ అందుబాటులో ఉంచుతుంది. ఎవరైనా వినియోగదారుడు కేవలం 1కేవీ లోడుకు మాత్రమే అనుమతి పొంది. వేసవి తీవ్రత దష్ట్యా అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తే ఆ ప్రభావం సమీప ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. వినియోగదారులందరూ విద్యుత్‌శాఖకు సహకరించి వాడుతున్న లోడ్‌కు అనుగుణంగా అనుమతి పొందితే భవిష్యత్‌లో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం తక్కువగా ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు ఇతరత్రా విద్యుత్ ఉపకరణాలు వాడే సమయంలో కచ్చితంగా స్టెబిలైజర్లను వినియోగించాలి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తుంటే సత్వరమే సంబంధిత విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి.
ఇలా చేయవద్దు
● గృహాల్లో 15 యాంప్స్ విద్యుత్ ఉపయోగించేచోట, 30 యాంప్స్ విద్యుత్ భారంపడే పరికరాలు వినియోగిస్తే తీగలు కాలిపోయే ప్రమాదముంది.
● ఒకే స్విచ్ బోర్డుకు ఎక్కువ ప్లగ్‌లు ఉపయోగిస్తే ఒక్కసారిగా లోడ్ పెరిగి స్పార్క్ వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది.
● ఎండలో విద్యుత్ తీగలు ఉంచితే భవిష్యత్తులో తీగలపై ఉన్న రబ్బర్ మెత్తబడి ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.
● ఇంట్లో ఒకేసారి విద్యుత్ ఉపకరణాలన్నింటినీ ఆన్‌చేసి ఉంచవద్దు.
● కంప్యూటర్ పరికరాలు, టీవీల వద్ద విద్యుత్ తీగలను చిందరవందరగా ఉంచరాదు.
● రక్షణ పరికరాలైన ఎంసీబీ(మైక్రో సర్క్యూట్ బ్రేకర్), ఎంసీసీబీ(కరెంట్ కంట్రోలర్ బ్రేకర్) ఫ్యూజులను బైపాస్ చేయకూడదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● వేసవికాలం ప్రారంభమయ్యే ముందు ప్రతి ఒక్కరూ ఇళ్లు, కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో తీగల వ్యవస్థను తనిఖీ చేయించుకోవాలి
● విద్యుత్ వైరింగ్ చేయించేటప్పుడు పూర్తిగా ఐఎస్‌ఐ, బీఐఎస్ మార్క్ కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని మాత్రమే ఉపయోగించాలి.
● ఇంట్లో విద్యుత్ వినియోగం ఆధారంగా విద్యుత్‌శాఖ నుంచి లోడ్‌ను తీసుకోవాలి.
● అందుకు తగినట్లు వైరింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏసీలు, కూలర్లు, వాటర్ హీటర్లు, మైక్రో ఒవెన్ ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగించాలి.
● ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని బట్టి దానికనుగుణంగా నాణ్యత కలిగిన విద్యుత్ తీగలను వినియోగించాలి.
● నాసిరకం విద్యుత్ పరికరాలతో విద్యుత్ వృథా కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వైరింగ్ మరింత పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి.
● గృహాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా న్యూట్రల్ పరికరాల కోసం సరిపడినంత ఎర్త్ ఎలక్ట్రోడ్ ఏర్పాటు చేసుకోవాలని.
● ఎండాకాలంలో రక్షణ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే ఎర్తింగ్ సరైన పద్ధతిలో ఉంచేందుకు అవసరమైన ప్రదేశంలో నీరు, దొడ్డుఉప్పు ఉపయోగించాలి.
● విద్యుత్ వాడేందుకు మూడు పిన్నుల ప్లగ్‌లు, సాకెట్లు మాత్రమే ఉపయోగించాలి.
● విద్యుత్ స్తంభాల నుంచి మీటర్ వరకు ఉండే సర్వీస్ వైర్లు అతుకులు లేకుండా ఉండేలా చూసుకోవాలి.
X
లోడ్ ఎక్కువైతే వైర్లు కాలిపోయే ప్రమాదం
షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలకు ముప్పు
సరఫరాలో లోపాలుంటే సిబ్బందికి ఫిర్యాదు చేయాలి
అప్రమత్తత అవసరం
వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ తీగలు వ్యాకోచం చెందే అవకాశం ఉంది. షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. గృహాల్లో వినియోగించే విద్యుత్ ఉపకరణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వైరింగ్‌ను చేయించుకోవాలి. ఎటువంటి సమస్యలు ఉన్నా సిబ్బందికి తెలియజేయాలి.
– జి.ప్రసాదరావు,
డీఈఈ, విద్యుత్‌శాఖ, పాతపట్నం

విద్యుత్‌కు వేసవి షాక్..!

విద్యుత్‌కు వేసవి షాక్..!