
మాట్లాడుతున్న జేసీ నవీన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల విషయంలో త్వరితగతిన చార్జిషీట్ ఫైల్ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా అధికారులను ఆదేశించారు. జిల్లా కోర్టులోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ సమీక్ష బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా పోలీసు యంత్రాంగం కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు శ్రీదేవి, మహేంద్ర ఫణికుమార్, భాస్కరరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిప్పేస్వామి, జిల్లా జైలు సూపరింటెండెంట్ నబీఖాన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మెట్ట మల్లేశ్వరరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అదనంగా ధాన్యం అడిగే మిల్లర్లపై చర్యలు
జలుమూరు/సారవకోట: రైతుల నుంచి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో నిర్దేశించిన కేజీలు కంటే అదనంగా ధాన్యం అడిగితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ హెచ్చరించారు. బుధవారం జలుమూరు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఏ–గ్రేడ్ రకం క్వింటాకు రూ.2,203, బీ–గ్రేడ్ రకం రూ.2,183గా మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ధాన్యం అమ్మిన 21 రోజులకు రైతుల ఖాతాకు నగదు జమ అవుతుందన్నారు. అనంతరం సారవకోట మండల పరిషత్ సమావేశ మందిరంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈకేవైసీకి అనుగుణంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 390 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వాటి ద్వారా సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్, సివిల్ సప్లయ్ డీఎం కె.శ్రీనివాస్, తహసీల్దార్ బి.సత్యం, ఏఓ కె.సురేష్ కుమార్, డీఎం శ్రీనివాసరావు, సారవకోట ఎంపీడీఓ రాంబాబు, తహశీల్దార్ హనుమంతరావు, నరసన్నపేట ఏడీ రవీంద్రభారతి, ఏఓ కెసీహెచ్ వెంకటరావు పాల్గొన్నారు.
గిరి రహదారుల పరిశీలన
మెళియాపుట్టి: సీతంపేట ఐటీడీఏ పీఓ కల్పనాకుమారి బుధవారం మెళియాపుట్టి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కొండ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలైన హడ్డివాడ, కేరాసింగి, కేరాసింగిగూడల పరిధిలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం డేగలపోలూరు, చింతలపోలూరు గ్రామాల్లో జీపీఎస్ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఆమెతో పాటు ఎంపీడీఓ చంద్రకుమారి, సిబ్బంది ఉన్నారు.
ఐటీఈపీ కోర్సులో ప్రవేశాలకు ఆహ్వానం
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం (2023–24) ప్రారంభిస్తున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీలో 110 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నేరుగా గానీ, రిజిస్టర్ పోస్టులో గానీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ –2023 లో అర్హత మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 16న మెరిట్ లిస్ట్ ప్రదర్శిస్తామని తెలిపారు.

రోడ్డు పనులపై చర్చిస్తున్న ఐటీడీఏ పీఓ కల్పనాకుమారి