
మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్ నవీన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: విభిన్న ప్రతిభావంతులపై ఎవరైనా వివక్ష చూపితే చర్యలు తప్పవని ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. వారి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, చట్టాలు, హక్కులపై వారు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. విభిన్న ప్రతిభావంతుల చట్టం, ఆంధ్రప్రదేశ్–2016లోని పలు అంశాలపై నూతనంగా ఏర్పా టు చేసిన జిల్లా కమిటీతో జిల్లా వయోవృద్ధులు, హిజ్రాలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డు, ఆధార్ అనుసంధానంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించా రు. విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్రైసైకిళ్లను ప్రభుత్వం అందిస్తోందని, అర్హులకు బ్యాంకు రుణాలు అందిస్తోందని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.కవిత మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఓసారి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. వ్యాపారాలకు బ్యాంకు రుణాలను మంజూరు చేస్తామని లీడ్ బ్యాంక్ ఏజీఎం జి.సూర్యారావు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎల్. విద్యాసాగర్, జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనురాధ, డీసీహెచ్‌ఎస్ భాస్కర రావు, జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.