
బ్యారేజీ నుంచి దిగువకు విడిచిపెడుతున్న వరద నీరు
హిరమండలం: హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద గురువారం వరద నీరు పెరిగింది. ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో గత రెండురోజులుగా పడుతున్న తేలికపాటి వర్షాలకు వంశధారలో వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారానికి బ్యారేజీ వద్ద 37.72 మీటర్ల నీటిమట్టం ఉంది. బుధవారం ఉదయం నాటికి 11,418 క్యూసెక్కులు ఉన్న ప్రవాహం గురువారం వేకువకు పెరిగి 28,050 క్యూసెక్కులకు చేరింది. ఉదయం 5 గంటలకు 32,300 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. దీంతో వంశధార అధికారులు అప్రమత్తమయ్యారు. వచ్చిన నీటిని 17గేట్లు పైకి ఎత్తి దిగువకు విడిచిపెట్టారు. ఉదయం 7 గంటలకు 37,450 క్యూసెక్కులకు పెరిగి సాయంత్రం 4 గంటలకు 34,200 క్యూసెక్కులకు వరద కాస్త తగ్గిందని ఇన్‌చార్జ్ డీఈ వై.అనిల్‌కుమార్ తెలిపారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 613 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1867 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు డీఈ తెలిపారు.
బాహుదా.. చూస్తే ఫిదా
ఇచ్ఛాపురం రూరల్: గత రెండు రోజుల పాటు ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల్లో కురిసిన మోస్తరు వర్షాలకు బాహుదా వరద నీటితో కళకళలాడుతోంది. దీంతో బొడ్డబడ, బిర్లంగి, కేదారిపురం, కొళిగాం, హరిపురం, మశాఖపురం, లొద్దపుట్టి, ఈదుపురం, ఇన్నేశుపేట, ధర్మపురం, జగన్నాథపురం, కేశుపురం, బూర్జపాడు, డొంకూరు, లక్ష్మీపురం పంట పొలాలకు అవసరమైనంత సాగునీరు అందడంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.

ఈదుపురం వంతెన వద్ద బాహుదా నది జలకళ