
కంటైనర్‌ను తనిఖీ చేస్తున్న విశ్వసముద్ర సిబ్బంది
టెక్కలి: నందిగాం మండలం దేవుపురం సమీపంలో సన్ ఇండియా రాక్స్ పాలిషింగ్ యూనిట్ నుంచి పర్మిట్‌లో పేర్కొన్న దాని కంటే అదనంగా 18 ఎం.ఎం. పరిమాణం గల కలర్ గ్రానైట్ పాలిషింగ్ షీట్లను తరలిస్తున్న కంటైనర్‌ను బుధవారం టెక్కలి సమీపంలో విశ్వ సముద్ర సిబ్బంది పట్టుకున్నారు. పర్మిట్‌లో సుమారు 5,442.739 చదరపు అడుగులకు బిల్లు తీసుకుని 6,259.79 చదరపు అడుగుల మేరకు గ్రానైట్ పాలిషింగ్ షీట్లను కంటైనర్‌లో విశాఖ పోర్టుకు తరలిస్తుండగా.. నందిగాం మండలం లట్టిగాం నుంచి విశ్వ సముద్ర సిబ్బంది సదరు వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయినా వాహనం ఆపకుండా వేగం పెంచడంతో వెంబడించి టెక్కలి సమీపంలో మెళియాపుట్టి రోడ్డులో పట్టుకున్నారు. వీఎస్ సిబ్బంది తనిఖీలు చేయగా అదనంగా 817 చదరపు అడుగులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో విషయాన్ని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ అధికారులు పరిశీలించి సుమారు రూ.50 వేల అపరాధ రుసుం విధించారు.