
ఆదిత్యుని జ్ఞాపికను ట్రైనీ కలెక్టర్‌కు అందజేస్తున్న ఈఓ హరిసూర్యప్రకాష్
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ని జిల్లా ట్రైనీ కలెక్టర్ కె.రాఘవేంద్ర మీనా తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తొలిసారిగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సిబ్బంది గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ విశిష్టత, పర్వదినాల విశేషాలను ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ వారికి వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్, పాలకమండలి సభ్యుడు మండవిల్లి రవి తదితరులున్నారు. అనంతరం ఆదిత్యుని జ్ఞాపికను అందజేశారు.
ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ యాత్ర వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
రణస్థలం: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు సీపీఎం ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ బైక్ యాత్ర జయప్ర దం చేయాలని సీపీఎం నాయకులు వెలమల రమణ, సీహెచ్ అమ్మన్నాయుడులు కోరారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఉక్కు రక్షణ బైక్ యాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్కు బైక్ యాత్ర సెప్టెంబర్ 20న విశాఖపట్నంలో ప్రారంభమై 22న పొందూరు మీదుగా ఎచ్చెర్ల చేరుకుంటుందని, 22,23 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో బైక్ యాత్ర సాగుతుందని తెలిపారు. ఆరు జిల్లాలో 1200 కిలోమీటర్లు సాగి 29వ తేదీన స్టీల్ ప్లాంట్ వద్ద చేపడుతున్న నిరాహార దీక్ష శిబిరం వద్ద ముగిస్తుందని చెప్పారు. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అభిల భారత నాయకులు హాజరవుతారని తెలియజేశారు.
కంబకాయలో చోరీ
నరసన్నపేట: మండలం కంబకాయలో పాగోటి రమేష్ ఇంటిలో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది. ఇంటిలో 16 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారని రమేష్ తెలిపారు. ఉదయం రమేష్ తల్లి సావిత్రి లైట్ వేసి చూసే సరికి బీరువా తెరిచి కనిపించింది. పరిశీలించి చూస్తే.. బంగారు ఆభరణాలు, రూ. 15 వేలు నగదు కనిపించలేదు. దీంతో వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందజేశారు. చోరీ గురించి తెలుసుకున్న టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఇంటికి వచ్చి పరిశీలించారు. చోరీ ఎలా జరిగిందనేది రమేష్‌తో పాటు కుటుంబ సభ్యులు సావిత్రి, లావణ్యలను ప్రశ్నించి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించారు. చోరీ ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ దొంగల పనా లేదా తెలిసిన వారు ఎవరైనా పాల్పడి ఉంటారా అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై నరసన్నపేట ఎస్‌ఐ సింహాచలం వద్ద ప్రస్తావించగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

ఇంటిలో తెరిచి ఉన్న బీరువా