
మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వేదికగా శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. 15 ప్రైవేటు సంస్థలు పాల్గొనగా, 533 మంది నిరుద్యోగ యువతీయువకులు హాజరయ్యారు. ఆయా కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన లిఖిత, మౌఖికపరమైన పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ప్రతిభకనబర్చిన 209 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఉపాధి కల్పనే లక్ష్యం..
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించిందని డీఆర్‌డీఏ పీడీ డి.వి.విద్యాసాగర్ అన్నారు. చదువుతోపాటు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీబీ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపిక కాని అభ్యర్థులు నిరాశ చెందవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్కిల్ హబ్స్ ట్రైనింగ్‌లో చేరి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 8 స్కిల్ హబ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదవ తరగతి, ఆపైన చదివిన వారు ఈ కోర్సుల్లో చేరి నైపుణ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి కె.సుధ, స్థానిక ప్రిన్సిపాల్ పి.సురేఖ, సెట్‌శ్రీ సీఈఓ బి.వి.ప్రసాదరావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, కళాశాల నోడల్ జె.కె.సి కోఆర్డినేటర్ పైడితల్లి, బి.చంద్రమౌళి, ప్లేస్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎం.వంశీకృష్ణ, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.