నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు
బత్తలపల్లి: మండలంలోని ఈదుల ముష్టూరులో వినాయక నిమజ్జనం అనంతరం కొందరు ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో 11 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. గురువారం పోలీసులు విలేకర్లతో మాట్లాడారు. వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయంలో ముఖాలకు రంగులు పూసుకునే విషయంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఒక వర్గంలో ఆరుగురు, మరో వర్గంలో ఐదుగురిని గుర్తించి వారి వివరాలను నమోదు చేసి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
బత్తలపల్లిలో 19 మందిపైన: వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన 19 మందిపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
శనీశ్వరుడి ఆదాయం రూ.1.37 కోట్లు
పావగడ: స్థానిక స్వర్ణ శనీశ్వరాలయ హుండీలు, టికెట్ల ఆదాయం రూ 1.37 కోట్లు లభించింది. ఇందులో హుండీల ద్వారా రూ.70 లక్షలు, దర్శనం టికెట్ల ద్వారా రూ.67 లక్షలు లభించినట్లు ఆలయ పదాధికారులు గురువారం తెలిపారు. గత నాలుగు శ్రావణ శనివారోత్సవాలను పురస్కరించుకుని భక్తులు శనీశ్వరస్వామికి సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ రెండు రోజులు గా సాగింది. అన్నపూర్ణ దాసోహ భవనంలో ఏర్పాటు చేసిన లెక్కింపు ప్రక్రియ లో ఎస్‌ఎస్‌కే ట్రస్ట్ పదాధికారులు, ఆలయ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగుల సిబ్బంది పాల్గొన్నారు.
అమడగూరు: మండలంలోని పూలకుంట్లపల్లిలో విద్యుదాఘాతంతో మృతి చెందిన మస్తాన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌సర్కిల్‌లో బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ధర్నా చేశారు. ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు పలక ఆంజనేయులు, జిల్లా దళిత సంఘాల అధ్యక్షుడు మూలి యల్లంరాజు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కత్తి ఆనంద్, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు గంగులప్ప మాట్లాడారు. మస్తాన్ మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్ర విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. మస్తాన్ మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మస్తాన్ కుటుంబానికి న్యాయం చేసేంతవరకూ ధర్నా చేస్తామన్నారు. ఐదు గంటల పాటు ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుదాఘాతంతో చనిపోయిన మస్తాన్ కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. 10 ఎకరాలు ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని, మండల కేంద్రంలో 5 సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలన్నారు.చివరికి నల్లమాడ సీఐ శ్రీనివాసులు ధర్నా దగ్గరకు వచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. అయినా వారు వినకపోవడంతో చివరికి తహసీల్దార్ మారుతీ ప్రకాశ్ , సీఐ శ్రీనివాసులు మరోసారి ఆందోళనకారులతో చర్చించారు. మస్తాన్ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు మస్తాన్ మృతి కారకులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
వర్షం కోసం జలధి ఉత్సవం
అగళి: మండల పరిధిలోని మధూడిలో గురువారం వర్షాలు కురవాలంటూ రైతులు, ప్రజలు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు, జలది ఉత్సవం నిర్వహించారు. వీరభద్రస్వామి, రంగనాథస్వామి, కోల్లపూర్ధమ్మదేవి ఉత్సవమూర్తులను ట్రాక్టర్లో ఊరేగింపుగా కర్ణాటక రాష్ట్రం సిద్దరబెట్ట గ్రామంలోని కొండపైకి తీసుకెళ్లి శిలింగం వద్ద ఉన్న జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అక్కడి నుంచి జలాలను (నీళ్లు) తీసుకొచ్చారు. మధూడి గ్రామంలో ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా చెరువుల వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వర్‌రావు
పుట్టపర్తి టౌన్: ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకొన్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. కార్మికుల హక్కుల పరిరక్షణకు డిసెంబర్ 1న చలో డిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. గురువారం ప్రశాంతి గ్రామంలో కార్మిక కర్షక భవన్‌లో కార్మిక కర్షక పరిష్కార మార్గల భవిష్యత్ కార్యాచరణపై సీఐటీయూ జిల్లా అఽధ్యక్షుడు జెడ్.పి శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 28 కార్మిక చట్టాలను మోదీ సర్కార్ నిర్వీర్యం చేసేందుకు నాలుగు లేబర్ కోడ్ల అమలు చేస్తోందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందో మోదీ చెప్పాలన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 1 నుంచి మూడు రోజులు పాటు నిర్వహించే చలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
లేపాక్షి: మండలంలోని కల్లూరు పొలాల్లో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందాడు. వివరాలు .. బుధవారం ఉదయం కల్లూరుకు చెందిన మద్దిలేటప్ప (45) ఇంటి వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పొలంలో నీరు కట్టేందుకు వెళతానని వెళ్లారు. అయితే ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటికి రాలేదు. అనుమానం వచ్చి మృతుని బంధువులు, స్థానిక ప్రజలు పొలాల్లో గాలించారు. ఈ గాలింపులో ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. అయితే గురువారం రవి పొలంలోని సీమసప్పులో ఉన్న మృతున్ని గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తలకు బలమైన గాయాలయ్యాయని పోలీసులు గుర్తించారు. మృతుని భార్య అనితమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గ్రామంలోనే పంక్చర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మృతుడు ఎలా చనిపోయాడన్న వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ధర్నా


