పుట్టపర్తి: చత్తీస్‌గఢ్‌లో వీరమరణం పొందిన జవాన్ సుబ్బిరెడ్డి భౌతికకాయానికి పోలీస్ లాంఛనాలతో గురువారం అంత్యక్రియలు పూర్తిచేశారు. వివరాలు.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో సుబ్బిరెడ్డి పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ గాయపడటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దీంతో బీఎస్‌ఎఫ్ జవాన్లు సుబ్బిరెడ్డి భౌతికకాయాన్ని వారి స్వగ్రామం కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు. అంతకు ముందు కొత్తచెరువు నుంచి లింగారెడ్డిపల్లి వరకూ పెద్ద ఎత్తున అభిమానులు, బంధువులు, మాజీ సైనికోద్యోగులు ర్యాలీగా వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
నేడు బాలుర క్రికెట్ సెలక్షన్లు
హిందూపురం టౌన్: పట్టణంలోని ఎంజీఎం క్రీడామైదానంలో శుక్రవారం బాలుర అండర్ 15, అండర్ 18 క్రికెట్ సెలక్షన్లు నిర్వహిస్తున్నట్లు ఆర్‌డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ గురువారం తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని బాలురు క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు.
వ్యక్తిపై పోక్సో కేసు
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని పసులూరులో బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేఽధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి వివరాలమేరకు.. వెంకటాపురానికి చెందిన రాజు పసులూరు గ్రామంలో ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. రాజుకు ఇది వరకే పెళ్లి అయింది. అయితే నాలుగు రోజుల క్రితం బాలికను రాజు ఇంటి నుంచి తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో గురువారం ఇరువురిని స్టేషన్‌కు తీసుకొచ్చి రాజును అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. రాజుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


