పచ్చ పార్టీలో వర్గపోరు | - | Sakshi
Sakshi News home page

పచ్చ పార్టీలో వర్గపోరు

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

టీడీపీలో వర్గపోరు తార స్థాయికి చేరింది. ఇప్పటికే సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యం తగ్గగా... కొత్త నాయకులు తెరపైకి వచ్చారు. అధ్యక్షులూ మారారు.

మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో

సీనియర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. కానీ స్థానిక ఎన్నికల వేళ సీనియర్లంతా జూనియర్లతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. తమ మాట చెల్లకపోతే సత్తా ఏమిటో చూపుతామంటున్నారు.

సాక్షి, పుట్టపర్తి

తెలుగుదేశం పార్టీలో ఎవరికి పదవులు రావాలన్నా.. నామినేటెడ్‌లో స్థానం దక్కాలన్నా.. టికెట్‌ పొందాలన్నా సీనియర్లు కీలక పాత్ర పోషించేవారు. సీనియర్ల సిఫారసుల మేరకే పదవుల పంపకాలు నడిచేవి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిత్రపక్షాల సంగతి పక్కన పెడితే.. టీడీపీలోనే గ్రూపు తగాదాలు పార్టీ ప్రతిష్టను బాగా దెబ్బ తీస్తున్నాయి. సీనియర్లందరూ చంద్రబాబు వర్గంలో.. జూనియర్లంతా చినబాబు (లోకేశ్‌) వర్గంలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఎవరికి వారుగా అధిష్టానం వద్ద లాబీయింగ్‌ చేస్తున్నారు. కానీ ఎక్కువసార్లు చినబాబు వర్గానికే న్యాయం జరుగుతోందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదవులు అనుభవించారనే కారణంతో సీనియర్లకు ప్రాధాన్యం తగ్గించి చినబాబు నేతృత్వంలో జూనియర్లు పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జూనియర్లు చెప్పిన వారికే టికెట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా సీనియర్ల వెంట నడిచేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. దశాబ్దాల కాలంగా పార్టీ జెండా మోసినా.. కీలక సమయంలో తమ సీనియారిటీని పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గ్రూపు తగాదాలు టీడీపీ అధిష్టానాన్ని వెంటాడుతున్నాయి. టీడీపీలోని గ్రూపు తగాదాలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు అదృష్టం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చెల్లని సీనియర్ల సిఫారసులు..

జిల్లాలోని ఆరు (మడకశిర, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి) మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలతో పాటు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోసం ప్రత్యక్ష ఎన్నిక జరగనుంది. అదేవిధంగా పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పుడా) చైర్మన్‌ పదవికి అభ్యర్థిని పార్టీ నేతలు నామినేట్‌ చేయనున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి అధిష్టానానికి మూడు జాబితాలు పంపించినట్లు తెలిసింది. సీనియర్ల సిఫారసులు.. జూనియర్లు ఎంపిక చేసిన జాబితాతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి మరో జాబితా అధిష్టానం వద్దకు చేరినట్లు సమాచారం. చైర్మన్‌ పీఠం తమకే ఇవ్వాలని.. లేనిపక్షంలో కూటమి ధర్మంలో భాగంగా జనసేనకు ఇచ్చినా సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇరు వర్గాల ఆధిపత్యపోరులో జనసేన నాయకులకు అడక్కుండానే అదృష్టం వరించే అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నప్పటికీ తమకు ప్రాధాన్యం ఎందుకు ఉండదని సీనియర్లు ఎవరికి వారుగా జాబితాలు సిద్ధం చేస్తున్నారు.

జెడ్పీ, ‘పుడా’ చైర్మన్‌ స్థానాలకు పోటాపోటీ..

కొత్తగా జిల్లా పరిషత్‌ ఏర్పాటు కానుండగా...‘పుడా’ పరిధి కూడా విస్తరించింది. దీంతో ఈ రెండు పీఠాలపై పోటీ పెరిగింది. టీడీపీలోని సీనియర్లు, జూనియర్లు ఎవరికి వారుగా అధిష్టానం వద్ద లాబీయింగ్‌ చేస్తున్నారు. కొందరు చంద్రబాబు చుట్టూ తిరుగుతుండగా... జూనియర్లంతా లోకేష్‌తో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరిద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలిసింది. కుల సమీకరణాల్లో భాగంగా పలువురి పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీలో వర్గ విభేదాల కారణంగా తమకు అవకాశం దక్కుతుందనే ఉద్దేశంతో జనసేనలోనూ ఆశావహుల సంఖ్య పెరిగినట్లు తెలిసింది. దీంతో జెడ్పీ, పుడా చైర్మన్‌ల కోసం భారీ పోటీ నెలకొంది.

తారస్థాయికి విభేదాలు..

మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పెనుకొండలో మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి మధ్య ముందు నుంచి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో బీసీ వర్గానికి చెందిన నాయకులు చాలామంది విభేదిస్తున్నారు. హిందూపురంలో బాలయ్య అనుచరుల మధ్య పొసగడం లేదు. కదిరిలో ఎమ్మెల్యే కుందికుంటతో కూటమి నేతలు విభేదిస్తున్నారు. ధర్మవరంలో మూడు పార్టీల నాయకులు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సమరం తర్వాత పచ్చపార్టీ నేతలు తలోదారి చూసుకోనున్నట్లు తెలుస్తోంది.

‘బాబు’ బ్యాచ్‌కు

చినబాబు అనుచరుల సెగ

‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలో

మొదలైన యుద్ధం

తమకు సీటివ్వకపోతే

జనసేనకు ఇవ్వాలని సూచన

జెడ్పీ, ‘పుడా’ స్థానాల కోసం

నేతల పోటాపోటీ

జిల్లా నుంచి మూడు జాబితాలు

సిద్ధమైనట్లు సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement