ప్రశాంతి నిలయం: దేవశిల్పిగా, వాస్తుశిల్పి, శిల్పశాస్త్రానికి ప్రేరణగా ప్రసిద్ధి చెందిన భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాం ప్రసాద్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విశ్వకర్మ విశ్వానికే మొదటి ఆర్కిటెక్ట్ అన్నారు. శిల్పకళ, ఇంజినీరింగ్, నిర్మాణ రంగాలకు విశ్వకర్మ ప్రేరణగా నిలిచారన్నారు. దేవతల మందిరాలు, యజ్ఞవేదికలు, మండపాలు, వివిధ నిర్మాణాలు చేపట్టి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. నేటి ఆర్కిటెక్ట్‌లు, చేతివృత్తుల వారందరికీ ఆయన ఆదర్శమూర్తి అన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి అర్హులైన వారు సరైన విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లోపాలుంటే సరిచేసి పథకం వర్తింపజేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. అర్హులందరూ ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్‌రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హరికృష్ణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను తదితరులు పాల్గొన్నారు.
ఎం.కొండాపురం పంచాయతీకి
ఐఎస్‌ఓ గుర్తింపు
అనంతపురం ఎడ్యుకేషన్: కళ్యాణదుర్గం మండలం ఎం.కొండాపురం గ్రామ పంచాయతీకి నీటి సమృద్ధి అంశం కింద ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. సమర్థవంతమైన నీటి నిర్వహణతో పాటు ప్రజలకు నీటి సదుపాయాలు కల్పించేందుకు పంచాయతీ చేపట్టిన చర్యలకు గుర్తింపు లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చేతుల మీదుగా డిప్యూటీ ఎంపీడీఓ రంగనాయకులు, పంచాయతీ కార్యదర్శి లోకేష్ ఐఎస్‌ఓ ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
జిల్లాలో మోస్తరు వర్షం
అగళి: జిల్లా వ్యాప్తంగా గురువారం మోస్తరు వర్షం కురిసింది. సీజన్ ఆరంభంలో పలకరించిన వరుణుడు ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో వేసవిని తలపించే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. వరుణదేవా కరుణించవా...అంటూ ఊరూవాడా వేడుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మడకశిర, అగళి, హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి తదితర మండలాల్లో చెప్పుకోదగ్గ వర్షం కురిసింది. అగళి మండల పరిధిలోని కురుసాంగనపల్లి గ్రామానికి చెందిన జూలేగౌడ్ పొలంలో సాయంత్రం కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో కాలిపోయింది.


