స్కూళ్ల పరిశీలనకు నేడు అధికారుల బృందం | - | Sakshi
Sakshi News home page

స్కూళ్ల పరిశీలనకు నేడు అధికారుల బృందం

Sep 18 2026 12:21 AM | Updated on Sep 18 2026 12:21 AM

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలోని పలు పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాలు, బోధన తీరును పరిశీలించేందుకు కేంద్ర పాఠశాల విద్య, లిటరసీ కార్యదర్శి, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ సభ్యులుగా ఉన్న కేంద్రం బృందం శుక్రవారం జిల్లాలో పర్యటించనుంది. పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను కేంద్ర బృందం పరిశీలించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయా పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా స్కూళ్ల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట కేజీబీవీ కార్యదర్శి దేవానందరెడ్డి, సమగ్ర శిక్ష అడిషనల్‌ ఎస్పీడి రవీంద్రనాథ్‌రెడ్డి, పాఠశాల విద్య ఆర్‌జేడీ శామ్యుల్‌, డీఈఓ కిష్టప్ప తదితరులు ఉన్నారు.

సమస్యలు చెప్పండి పరిష్కరిస్తాం

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

కార్యదర్శి రాజశేఖర్‌

హిందూపురం టౌన్‌: ఉపకారాగారంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఉపకారాగారాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులను కుటుంబ సభ్యులు తరచూ కలుస్తున్నారా, బెయిల్‌ మంజూరైందా తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని రిమాండ్‌ ఖైదీలు దరఖాస్తు చేసుకుంటే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. భోజన తయారీలో నాణ్యత పాటించాలన్నారు. ఉపకారాగారంలో ఏమైనా సమస్యలుంటే స్థానికంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో కాగితంపై రాసి వేయాలన్నారు. ఉపకారాగార అధికారులు, సిబ్బంది రిమాండ్‌ ఖైదీల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపకారాగార అధికారి హనుమప్ప, న్యాయవాది ఆశ, లోక్‌ అదాలత్‌ సిబ్బంది రాజా, నాయక్‌, పారా లీగల్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

డ్యాన్స్‌ చేస్తూ

కుప్పకూలిన యువకుడు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

గుత్తి: వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో నివాసముండే అశోక్‌కుమార్‌ (26) బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం సంబరాల్లో పాల్గొన్నాడు. డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి కింద పడిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని కర్నూలు ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడు అశోక్‌ కుమార్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేసేవాడు. మృతుడికి భార్య ప్రశాంతి ఉన్నారు.

ఇద్దరు మహిళలపై దాడి

బత్తలపల్లి: భూ వివాదం నేపథ్యంలో ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసినట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాలమేరకు... మండలంలోని సంగాల రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 35లో ఉన్న 2.12 ఎకరాల భూమి విషయంలో తంబాపురం గ్రామానికి చెందిన ఎస్‌.శివమ్మకు ఆమె బంధువుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. గురువారం భూమి విషయంలో ఉన్న మనస్పర్థల కారణంగా శివమ్మ ఇంట్లోకి బంధువులు వెళ్లి రాళ్లు విసిరి, ఆమెతో పాటు ఆమె సోదరి పుష్పావతిపై దాడి చేసి గాయపర్చారు. శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement