కదిరి టౌన్: కదిరి ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణం అటకెక్కింది. ఎమ్మెల్యే కందికుంట ఎన్నోసార్లు ఆస్పత్రి భవనాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నీటి మీద రాతగానే మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత ప్రభుత్వంలో మంజూరు..
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని మంజూరు చేశారు. ఇందులో భాగంగానే రూ.18 కోట్లను కేటాయించారు. గత ప్రభుత్వంలోనే దాదాపు 70 శాతం నిర్మాణాలను కూడా పూర్తి చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆస్పత్రి భవన నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న భవనం పూర్తికాకపోవడంతో ప్రజల డబ్బు వినియోగంపై కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి.
పేరుకు 100 పడకల ఆస్పత్రి..
కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి 100 పడకల ఆస్పత్రి అయినప్పటికీ అవసరమైన స్థాయిలో వైద్యులు, సిబ్బంది, పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులో లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. నిత్యం ఎంతోమంది రోగులు ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. వారికి సరైన వైద్యం అందక ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. అత్యవసర కేసులు వస్తే వెంటనే అనంతపురం, బత్తలపల్లి ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
నాణ్యమైన వైద్య సేవలందించాలి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
కదిరి ఏరియా ఆస్పత్రి నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరు
70 శాతం పనులనూ
పూర్తిచేసిన వైనం
నిర్మాణాన్ని పట్టించుకోని
చంద్రబాబు ప్రభుత్వం
హామీలిచ్చి చోద్యం చూస్తున్న
ఎమ్మెల్యే కందికుంట !
గతంలో కదిరిలో జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆస్పత్రి భవనాన్ని త్వరలోనే పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గతంలోనూ ఇదే హామీని ఎన్నోసార్లు ఇచ్చారు. అయితే నేటికీ ఆస్పత్రి నిర్మాణ పనులు మాత్రం పూర్తిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం ఆస్పత్రి భవనం ఎప్పుడో పూర్తికావాల్సి ఉందని, కేవలం అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే పూర్తికావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటకెక్కిన
ఎమ్మెల్యే
హామీ..
ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలి
కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి రోజూ 500, 600 మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రి సిబ్బంది వారికి సరైన వైద్య సేవలు అందించడంలో విఫలమవుతున్నారు. దాదాపు 12 మండలాల నుంచి రోగులు ఆస్పత్రికి వస్తుంటే కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేని దుస్థితి నెలకొంది. వెంటనే వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు స్పందించి ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.
– జీఎల్.నరసింహులు సీపీఎం నాయకుడు
కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి యాక్సిడెంట్, అత్యవసర కేసులన్నీ అనంతపురం, బత్తలపల్లి ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. వచ్చిన వారికి సరైన వైద్య సేవలు అందించకపోతే ఇక్కడ ఆస్పత్రి ఎందుకు ఉన్నట్లు. ఇప్పటికై నా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించాలి. అలాగే నిర్మాణంలో ఉన్న ఏరియా ఆస్పత్రి భవనాన్ని వెంటనే పూర్తిచేయాలి.
– రాజేంద్ర, విద్యార్థి సంఘం నాయకుడు


