మత్తు మందిచ్చి మంగళసూత్రం చోరీ | - | Sakshi
Sakshi News home page

మత్తు మందిచ్చి మంగళసూత్రం చోరీ

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

ధర్మవరం: రైలులో ప్రయాణిస్తున్న దంపతులకు మత్తు మందు ఇచ్చిన ఓ మహిళ 50 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని అపహరించింది. గురువారం స్థానిక ఆర్‌పీఎఫ్‌ స్టేషన్‌లో సీఐ నాగేశ్వరరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన కుమ్మర గోవిందు నౌకాదళంలో పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితం ఆయన, భార్య సంధ్యతో కలిసి షిరిడీకి వెళ్లారు. సాయిబాబా దర్శనం అనంతరం అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఈనెల 15వ తేదీ (మంగళవారం) కోపర్గావ్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుని తెల్లవారుజామున కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌(రైలు నంబర్‌ 12628)లో తిరుగు పయనమయ్యారు. రిజర్వేషన్‌ దొరక్కపోవడంతో గోవిందు ఓ బోగీలో ఎక్కాడు. భార్య సంధ్యను రద్దీ తక్కువగా ఉన్న లేడీస్‌ కోచ్‌లో ఎక్కించాడు. ఓ స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు భోజనం చేసేందుకు భార్య ఉన్న లేడీస్‌ కోచ్‌లోకి గోవిందు వెళ్లాడు. భోజనం చేసిన అనంతరం పక్కనే కూర్చున్న ఓ మహిళ వారికి చిక్కీతో చేసిన ప్రసాదాన్ని ఇచ్చింది. దీంతో వారు కళ్లకద్దుకుని తిన్న అనంతరం నిద్రలోకి జారుకున్నారు. మేల్కొని చూసేసరికి ధర్మవరం రైల్వేస్టేషన్‌ వచ్చింది. దీంతో వారు తమకు ఎవరో మత్తుమందు ఇచ్చారని స్థానిక రైల్వే పోలీసులకు తెలిపారు. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బుధవారం రాత్రి వారికి మత్తు దిగాక రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. తన భార్య మెడలోని 50 గ్రాముల బంగారు మంగళసూత్రం కనిపించడంలేదని, తమకు మత్తు మందు ఇచ్చిన మహిళే చోరీ చేసిందని గోవిందు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని సీఐ నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం రైళ్లలో చోరీలు చేసే మహిళల ఫొటోలను తెప్పించి గోవిందు భార్యకు చూపించగా ఆమె...తమకు మత్తుమందు ఇచ్చిన మహిళను గుర్తించింది. అంతకుముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవిందు దంపతులను ఆర్‌ పీఎఫ్‌ అధికారులు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement