హిందూపురం టౌన్: పట్టణంలోని నేతాజీ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో 1980–81 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక సువర్ణ భారతి కళాశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు నాలుగు దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ చిన్ననాటి అనుభవాలు, పాఠశాల జ్ఞాపకాలు, గురువులతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అప్పట్లో వారికి సోషల్ స్టడీస్ బోధించిన ఉపాధ్యాయులు కల్లూరు జానకిరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు కల్లూరు జానకీ రామారావు తెలుగులో అనువదించిన మంకుతిమ్మన కగ్గ పద్యకావ్యం 2వ భాగాన్ని పట్టణ వన్‌టౌన్ సీఐ రాజగోపాల్‌నాయుడు, టూటౌన్ సీఐ కరీం, తదితర విశ్రాంత ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. సమ్మేళనంలో కల్లూరు రాఘవేంద్రరావు, సువర్ణ భారతి కళాశాల ఏఓ అనిల్ కుమార్, కేకే వెంకటేష్, డాక్టర్ రామచంద్రరావు పాల్గొన్నారు.


