ఎండుతున్న ఆశలు | - | Sakshi
Sakshi News home page

ఎండుతున్న ఆశలు

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలో తీవ్ర వర్షా పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వరుణ దేవుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొదట్లో మాత్రమే వర్షాలు

నైరుతీ రుతుపవనాలు జిల్లాలో ప్రవేశించగానే మంచి వర్షాలు కురిశాయి. ఆ వర్షాలకు ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే రైతులంతా భూమిని దున్ని సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాగానే వర్షాలు కురవలేదు. జూలై నెలలో ఇప్పటి వరకూ ఒక్క నల్లమాడ, బుక్కపట్నం మండలాలు తప్ప ఎక్కడా పదును వర్షం కురవలేదు. సుమారు నెల రోజుల నుంచి వర్షాలు కురవక పోవడంతో ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ, జొన్న, కంది తదితర పంటలు ఎండిపోతున్నాయి.

వలస బాటలో అన్నదాతలు

జూన్‌లో 58.2 మి.మీ వర్షపాతం నమోదుకాగా, జూలై నెలలో 95 మి.మీకు గాను ఇప్పటి వరకూ కేవలం 5.2 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయా లేదా అనే సందేహంలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సమయాను కూలంగా వర్షాలు కురవక పోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించక పోవడం, సంక్షేమ పథకాలు అందించకపోవడంతో జిల్లాలో వ్యవసాయం చేయడం కత్తి మీద సాములా మారింది. దీంతో చేసేదిలేక బెంగళూరు, హైదరాబాద్‌కు వలస వెల్లడానికి సిద్ధమవుతున్నారు.

సాగు విస్తీర్ణం తగ్గింది

ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వర్షాలు కురవకపోవడంతో రైతులు సాగుపై మక్కువ చూపలేదు. జిల్లాలో వ్యవసాయ బోర్ల కింద, మెట్ట భూమిలో కేవలం 44,396 హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. వర్షాలు రాక పోతే వేరుశనగ సాగు చేయడం మంచిది కాదు. పీఎండీఎస్‌ ద్వారా సాగు చేసిన పంటలు మొలక శాతం పెరిగింది. ఇప్పటికీ పీఎండీఎస్‌పైనే రైతులు సాగు చేస్తున్నారు.

– కృష్ణయ్య, జిల్లా వ్యవసాయాధికారి

బోరు ఎండిపోయింది

ఎంతో కాలంగా మామిడి తోటను, పశువుల గడ్డిని, పంటను కాపాడిన బోరు బావి ఈ నెలలో నీళ్లు రాకుండా పోయాయి. దీంతో మామిడి తోట ఎండిపోతుందోమోనని భయంగా ఉంది. పశువుల కోసం సాగు చేసిన గడ్డికి పక్కన ఉన్న వ్యవసాయ బోరు నుంచి నీళ్లు పెడుతున్నాను. పశువులను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నాను. వర్షాలు కురవకపోతే వేల సంఖ్యలో బోర్లు ఎండిపోతాయి.

– లక్ష్మీపతి, సుబ్బరాయనిపల్లి, పుట్టపర్తి మండలం

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు

ఖరీఫ్‌లో వేసిన పంటలు ఎండుముఖం

ఆందోళనలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement