ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం

Jul 18 2026 9:45 AM | Updated on Jul 18 2026 9:45 AM

తలుపుల: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రైతులంతా ప్రకృతి వ్యవసాయం చేయాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పిలుపునిచ్చారు. దీనివల్ల పెట్టుబడితో పాటు నీటి అవసరం కూడా తగ్గుతుందన్నారు. శుక్రవారం ఆయన తలుపుల మండలంలోని పెద్దపల్లి గ్రామంలో పర్యటించారు. పీఎండీఎస్‌ విధానంలో మహిళా రైతు ఎన్‌.సంధ్యారాణి తనకున్న 1.60 ఎకరాల్లో పీఎండీఎస్‌ పద్ధతిలో సాగు చేసిన పంటలను పరిశీలించారు. పీఎండీఎస్‌ సాగు విధానం, రైతులకు కలిగే ఉపయోగాలను జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) కృష్టయ్య ఈ సందర్భంగా కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ రైతులతో మాట్లాడి పంటల సాగు, పెట్టుబడుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ యంత్రాంగం రైతులకు అండగా ఉంటుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్‌ రైతులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలో విత్తన వేరుశనగ పంపిణీని పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాన్నే పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ కళావతి, ఏఓ నాగ మధుసూదన్‌, తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాసులురెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కేజీబీవీలో కలెక్టర్‌ పాఠాలు..

పుట్టపర్తి అర్బన్‌: కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఉపాధ్యాయుడిగా మారారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి కేజీబీవీలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కేజీబీవీని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, విద్యార్థినుల వసతి గదులను నిశితంగా పరిశీలించారు. భోజన వసతిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు తెలుసుకునే క్రమంలో ఆయన ఉపాధ్యాయుడిలా మారారు. పదో తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్‌ వెంట ఎస్‌ఓ సుప్రజ, టీచర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement