మడకశిర: పట్టణంలోని హిందూపురం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీన్ (19) మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు... మృతుడు మడకశిర పట్టణానికి చెందిన వాడు. నవీన్ తండ్రి గోవిందరాజులు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని చిన్న కుమారుడు నవీన్ పట్టణంలోని తన ఇంటి నుంచి వ్యవసాయమార్కెట్ యార్డు వద్ద ఉన్న అంగడి వద్దకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. అయితే హిందూపురం రోడ్డులో సిమెంట్ లారీ ఢీకొనడంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన సిమెంట్ లారీని పోలీసులు మండలంలోని బుళ్లసముద్రం వద్ద స్వాధీనం చేసుకున్నారు. లారీని వదిలి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నవీన్ మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.
దంపతులకు తీవ్రగాయాలు
● బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
బత్తలపల్లి: సమీప బంధువు ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని నల్లబోయనపల్లి బస్‌స్టాప్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలమేరకు.. బత్తలపల్లికి చెందిన వడ్డె మధు, శైలజ దంపతులు ఇద్దరూ సమీప బంధువు ఒకరు మృతి చెందడంతో తలుపుల మండలం ఈరయ్యగారిపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అంత్యక్రియలు అనంతరం తిరిగి బత్తలపల్లికి వస్తుండగా మార్గమధ్యంలోని మండలంలోని నల్లబోయనపల్లి బస్‌స్టాఫ్ దాటిన తరువాత వెనుక నుంచి వస్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్రకు చెందిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మధు ఐచర్ డ్రైవర్ కావడంతో ఐచర్ వాహనాల అసోసియేషన్ నాయకులు పుల్లయ్య, బగ్గిరి రామ్మోహన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.
కోడి పందేల కేసులో 30 మంది అరెస్ట్
పుట్లూరు: మండలంలోని మడుగుపల్లి సమీపంలో ఈ నెల 12న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేసి 39 ద్విచక్ర వాహనాలు, మూడు పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గురువారం 30 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యబాబు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.45 వేలు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన 9 మందిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. పేకాట, మట్కా, కోడి పందెలు తదితర జూదాలను ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


