పుట్టపర్తి అర్బన్: కేంద్ర ఎన్నికల సంఘం మూడోదశ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–సర్)కు సిద్ధమైంది. జిల్లాలో జూన్ 5వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓలు ఓటరు జాబితాపై ఇంటింటి సర్వే చేపడతారు. ఈ ప్రక్రియపైనే అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.
23 ఏళ్ల ధ్రువీకరణతోనే ఇబ్బంది..
భారత ఎన్నికల సంఘం ఏటా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులూ చేస్తుంది. దీన్ని స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు. ఇందులో భాగంగా ఓటరు జాబితా నుంచి మృతుల పేర్లను తొలగించడం, 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా జాబితాలో చేర్చడం, ఓటరు అడ్రస్‌లను మార్చడం, జాబితాలో అచ్చు తప్పులు, ఫొటోలు, చిరునామాల మార్పు, నియోజక వర్గాల మార్పు తదితర వాటికి అవకాశం కల్పిస్తారు. కానీ ఈసారి ‘సర్’ సర్వేలో ప్రతి ఓటరూ బీఎల్‌ఓ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారం–2ను నింపి మళ్లీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతో పాటు తన కుటుంబం 23 ఏళ్లుగా భారతదేశంలోనే ఉన్నట్లు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల ఓట్లను టార్గెట్ చేసి ‘23 ఏళ్ల నివాసం’ ధ్రువీకరణపేరుతో ఓటరు జాబితా నుంచి గల్లంతు చేస్తుందా..అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీఎల్‌ఏల నియామకంపై పార్టీల కసరత్తు..
‘సర్’ సర్వే నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే జిల్లాలో గుర్తింపు పార్టీలన్నీ తమ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అప్రమత్తం చేస్తున్నాయి. అలాగే బీఎల్‌ఓల వెంట ఉండేందుకు బూత్‌లెవల్ ఏజెంట్లను నియమించుకోవడంలో తలమునకలయ్యాయి. తమ మద్దతుదారుల ఓట్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడుతున్నాయి. జిల్లాలో 1,840 పోలింగ్ బూత్‌లుండగా...గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ ఒక్కో బూత్‌కు ఒకరిని బీఎల్‌ఏగా నియమించుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీఎల్‌ఏల జాబితా తయారీలో ఆయా పార్టీలు నిమగ్నమై ఉన్నాయి.
జూన్ 4 నుంచి శిక్షణ..
గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం జిల్లాలోని 16,56,775 మంది ఓటర్లకు ఎన్నికల కమిషన్ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారం–2ను బీఎల్‌ఏలు నిశితంగా పరిశీలించి డూప్లికేట్ ఓటర్లు ఉంటే జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 8,24,039 మంది పురుష ఓటర్లు, 8,32,660 మంది మహిళా ఓటర్లు ఉండగా... ఇతరులు 76 మంది ఓటర్లు ఉన్నారు.
షెడ్యూల్ ఇలా...
● జిల్లాలో జూన్ 5 నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
● జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఓటరు వివరాలను పరిశీలిస్తారు.
● జూన్ 15 నుంచి జూలై 14 వరకూ బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారం–2ను ఇచ్చి పూర్తి చేయించి తిరిగి తీసుకుంటారు. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుంది.
● జూలై 21న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకూ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు.
● సెప్టెంబర్ 22న ఓటరు తుది జాబితాను విడుదల చేస్తారు.
ప్రతిపక్ష పార్టీల ఓటర్లపై కన్నేసిన
అధికార పార్టీ
వివిధ కారణాలు చూపి
ఓట్ల గల్లంతుపై దృష్టి!
అప్రమత్తమైన రాజకీయ పార్టీలు...
కార్యకర్తలకు అవగాహన
కార్యక్రమాలు
బీఎల్‌ఏల నియామకంపై
దృష్టి సారిస్తున్న వైనం
ఆందోళన వద్దు
‘సర్’ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఇందుకోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు కచ్చితంగా బీఎల్‌ఏలను నియమించుకోవాలి. ‘సర్’ కార్యక్రమాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తారు. ఎక్కడైనా తప్పులు చేస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు ఉంటాయి. – శ్యాం ప్రసాద్, కలెక్టర్


