ముఖం చూపితేనే హాజరు! | - | Sakshi
Sakshi News home page

ముఖం చూపితేనే హాజరు!

May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM

● హిందూపురానికి చెందిన ప్రకాష్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నత చదువుకోసం లీవ్‌ తీసుకున్నాడు. కోర్సులో చేరినప్పటికీ కళాశాల యాజమాన్యంతో హాజరు విషయం మాట్లాడుకుని ఇంటివద్దే ఉంటూ మరోపని చేస్తున్నాడు.

● పుట్టపర్తికి చెందిన రాము అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఈడీ కోర్సులో చేరాడు. కానీ రోజూ కళాశాలలకు వెళ్లకుండా హాజరు వేసేలా యాజమాన్యంతో మాట్లాడుకున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతూ కేవలం పరీక్షలు రాసి సర్టిఫికెట్‌ పొందేలా ప్లాన్‌ చేసుకున్నాడు.

...ఇలా కళాశాల ముఖమే చూడకుండా కోర్సు పూర్తి చేస్తున్నవారు కోకొల్లలు. ఇలాంటి వారికి చెక్‌ పెడుతూ ఉన్నతవిద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ రెండుసార్లు ముఖ హాజరు వేసేలా ఆదేశాలిచ్చింది.

కదిరి: అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు (డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ, తదితర) అధ్యాపకులతో పాటు విద్యార్థులకు సైతం ఏఐ ఆధారిత ముఖ హాజరు (ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు తాజాగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్‌ తదితర కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం(2026–27) నుంచే ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు చేయనున్నారు.

రోజూ రెండుసార్లు ముఖ హాజరు..

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ ముఖ ఆధారిత హాజరు వేస్తున్నారు. ఉదయం వెళ్లగానే ఒకసారి, తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఇంకోసారి ఇలా రోజూ రెండుసార్లు ముఖ హాజరు వేస్తారు. ఇదే తరహాలో ఇకమీదట ఉన్నత కళాశాలల్లో కూడా బోధనా సిబ్బందితో పాటు విద్యార్థులు రోజూ ఉదయం, సాయంత్రం ఇలా రెండు సార్లు ముఖ హాజరు వేయాల్సి ఉంటుంది.

డుమ్మా కొట్టేవారికి కష్టమే..

జిల్లాలోని కొన్ని ప్రైవేటు కళాశాల్లో విద్యార్థులు హాజరు కాకపోయినా హాజరైనట్లు చూపుతూ వారినుండి కొంత డబ్బు తీసుకుంటున్నారు. ముఖ హాజరుతో ఇకమీదట వీరి ఆటలు సాగవు. అలాగే కొందరు ఎస్‌జీ టీచర్లు బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సుల పేరుతో స్టడీ లీవ్‌ పెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇలాంటి వారు జిల్లాలో 130 మంది ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం తీసుకురావడంతో ఇకమీదట వీరు కాలేజ్‌కి డుమ్మా కొట్టేందుకు అవకాశం లేదు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు లింక్‌..

ఉన్నత విద్య చదివే విద్యార్థులు ఇక మీదట ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందాలంటే కచ్చితంగా కళాశాలకు వెళ్లాల్సిందే. నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో సుమారు 70 శాతం మంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్నారు. వీరికి రూ.35 కోట్ల మేర ఖర్చు అవుతోంది. వీరి హాజరుతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా తక్కువగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను తీసుకొస్తోందని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన ఒక లెక్చరర్‌ పేర్కొన్నారు.

కళాశాలల్లో హాజరుకు

కఠిన నిబంధనలు

ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులకూ

ముఖ హాజరు

2026–27 విద్యా సంవత్సరం నుంచే

అమలు

Advertisement
 
Advertisement
Advertisement